రివ్యూ : సప్తగిరి ‘నవ్వుల’ ఎక్స్‌ప్రెస్‌

టైటిల్: సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌
నటీనటులు: సప్తగిరి.. రోషిణి ప్రకాష్‌.. అలీ.. షకలక శంకర్‌.. పోసాని కృష్ణమురళి.. షాయాజీ షిండే.. అజయ్‌ ఘోష్‌.. శివప్రసాద్‌..
సంగీతం: బుల్గానిన్‌
సినిమాటోగ్రాఫీ: రాంప్రసాద్‌
ఎడిటింగ్ : గౌతంరాజు
నిర్మాత: కె.రవికిరణ్‌
దర్శకత్వం: అరుణ్‌ పవార్‌
విడుదల తేది: 23-12-2016

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

saptha

యాక్సిడెంటల్ గా యాక్టర్ అయిపోయాడు సప్తగిరి. యాక్టర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు కావాలని కోరిక. ఏడేళ్ల పాటు తెరవెనుక డైరక్షన్ డిపార్ట్ మెంట్ పనిచేశాడు. అయితే విధి ఇంకోలా వుంది. కమెడియన్ గా దూసుకొచ్చాడు. అదీ మామూలుగా కాదు. స్టార్ కమెడియన్ గా. ”ప్రేమకథాచిత్రమ్”తో ఓవర్ నైట్ పాపులర్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. ఇప్పుడాయన హీరో అవతారం ఎత్తాడు. కమెడియన్లు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. రాజబాబు నుండి సునీల్ వరకూ అందరూ ‘హీరోయిజం’ ప్రయత్నం చేశారు. ఇప్పుడు సప్తగిరి కూడా హీరోగా వచ్చాడు. ”సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌”తో. సప్తగిరి హీరోగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందకు వచ్చింది. మరి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఏ వేగంతో ప్రయాణించింది. హీరోగా సప్తగిరి ప్రయాణం ఎలా సాగింది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లిపోవాల్సిందే.

కథ: తమిళంలో హిట్ అయిన ‘తిరుడన్‌ పోలీస్‌’కి రీమేక్‌ ఇది. అయితే తెలుగు వెర్షన్ కోసం చాలా మార్పులు చేశారు. షార్ట్ కట్ లో ఈ సినిమా కధ గురించి చెప్పుకుంటే.. హీరో (సప్తగిరి) తండ్రి ఓ నిజాయతీగల కానిస్టేబుల్‌. తనలా కానిస్టేబుల్ లా కాకుండా కొడుకుని ఐఏఎస్‌ గా చూడాలని కోరిక. అయితే హీరోకి మాత్రం పోలీసు ఉద్యోగం ఇష్టముండదు. సినిమా పిచ్చి. ఎప్పటికైనా సినిమా యాక్టర్ కావాలనే కోరిక అతగాడిది. ఇంతలో ఓ విషాదం. ఓ ఎన్‌కౌంటర్‌లో హీరో తండ్రిని దారుణంగా చంపేస్తారు. తండ్రి ఉద్యోగం హీరోకి వస్తుంది. ఖాకీ వేసుకున్న హీరో తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలని ప్రతిజ్ఞ పెట్టుకుంటాడు. మరి ఆ పగ ఎలా తీర్చుకున్నాడు ? అనేది తెరపై చూడాల్సిందే.

ప్లస్..

* సప్తగిరి నటన
* కామెడీ
* ఫాదర్ సెంటిమెంట్‌

మైనస్..

*రొటీన్‌ కథ
*సెకండాఫ్ సాగదీత
* రివేంజ్‌ డ్రామా పట్టాలు తప్పడం

నటీనటుల పెర్పామెన్స్ :
ముందుగా చెప్పినట్లే ఇది సాదసీదా రివెంజ్ డ్రామా. ‘తిరుడన్‌ పోలీస్‌’ నచ్చి స్వయంగా సప్తగిరి ఈ సినిమాని హ్యాండిల్ చేశాడు. అందుకే సాధ్యమైనంత వరకూ తన ఇమేజ్ కు తగ్గటు కధలో మార్పులు చేశారు. ఈ పాత్ర సప్తగిరికి సరిగ్గా సరిపోయింది. అలా ఆడుతూ పాడుతూ చేసేశాడు. వాస్తవానికి ఇది రివెంజ్ డ్రామా వున్న కధ. మరో హీరో అయితే భారీ డైలాగులు, యాక్షన్‌ ఛేజింగులు అవసరం. అయితే సప్తగిరికి తనెంటో తెలుసు.. అందుకే ఎలాంటి హంగామా లేకుండా తన కామెడి టైమింగ్ తో నడిపించేశాడు. సినిమా పిచ్చి వున్న ఓ కుర్రాడిగా సినిమా బిగినింగ్ లో వచ్చిన సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. తండ్రీ-కొడుకుల మధ్య సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. సింగిల్‌ టేక్‌లో దానవీర శూరకర్ణ డైలాగ్‌ చెప్పిన డైలాగ్ కు క్లాప్స్ పడతాయి. హీరోయిన్ పాత్ర కూడా ఓకే. కాలనీలో వచ్చిన కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. షకలక శంకర్‌, అలీ, పోసాని కృష్ణమురళి పాత్రలు కూడా పండాయి.

సాంకేతిక విభాగం :
నిర్మాత: కె.రవికిరణ్‌ ను అభినందించాలి. చిన్న సినిమా అని ఆయన ఎక్కడా ఖర్చుకు తగ్గలేదు. సినిమాకి ఎంత పెట్టాలో అంతా పెట్టారు. చాలా నీట్ గా వచ్చిందీ సినిమా. ప్రతీ సీన్‌ రిచ్‌గా కనిపిస్తుంది. ఫారిన్ ఓ రెండు పాటలు షూట్ చేశారు. ఆ పాటలు చక్కగా వచ్చాయి. అందులో సప్తగిరి డ్యాన్సులు కూడా బావున్నాయి. ఛాయాగ్రహణం చక్కగా కుదిరింది. మ్యూజిక్ కూడా బావుంది. ఓ రెండు పాటలు వినడానికి బావున్నాయి. మిగతా సాంకేతిక విభాగం కూడా ఓకే.

చివరిగా.. కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిపోతున్న సప్తగిరి హీరోగా కూడా కనిపించాలని చేసిన ప్రయత్నం ఇది. అయితే అనవసరమైన హీరోయిజం కు పోకుండా తన బాలలు ఏమిటో తెలుసుకొని ఈ సినిమా చేశాడు. బేసిగ్గా ఇదో రివెంజ్ డ్రామా అయినప్పటికీ తన కామెడి మార్క్ తో డీల్ చేశాడు. సెకండాఫ్ లో ఎక్స్ ప్రెస్ వేగం కాస్త తగ్గినట్లు అనిపించింది. రివెంజ్ ను కామెడి ఓవర్ టెక్ చేసినట్లు కనిపించింది. అయితే క్లైమాక్స్ లో మళ్ళీ బండి పట్టాలెక్కిసింది. మొత్తంమ్మీద సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ .. ‘నవ్వుల” ఎక్స్‌ప్రెస్‌ గా పాసైపోయింది.

Tagged: , ,