బంగ్లాపై భారత్‌ ఘన విజయం

uppal test

ఉప్పల్‌ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 459 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోహ్లీ కెప్టెన్సీలో సొంత గడ్డపై వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకున్నట్టయ్యింది.

5వ రోజు 103/3 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్. ఆట ప్రారంభం అయిన కొద్దిసేపటికే ఓవర్ నైట్ ఆటగాడు షకిబుల్ హసన్(21) వికెట్ ను నష్టపోయింది. ఆ తరువాత కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ – మొహ్మదుల్లా జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 56 పరుగులు జోడించిన పిదప ముష్ఫికర్(23) అవుట్ కాగా, బంగ్లా ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్(22) ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 242 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మెహెది హసన్‌ (23) జడేజా బౌలింగ్‌లో సాహాకు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. చివరి బ్యాట్స్‌మేన్ తస్కిన్ అహ్మద్ కేవలం ఒక్క పరుగు మాత్రం చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో.. బంగ్లా 250పరుగులకి ఆలౌటైంది.

ఇక, తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 687పరుగులు చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ కోహ్లీ (204) డబుల్ సెంచరీతో కదంతొక్కగా, మురళీ విజయ్, సాహా సెంచరీలు బాదారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 388 పరుగులు మాత్రమే చేసిన బంగ్లా 299 పరుగులు వెనకబడింది. ఫస్ట్ ఆధిక్యాన్ని దృష్టిలో ఉంచుకొని సెంకండ్ ఇన్నింగ్స్ లో ధనా ధన్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 156/4వ డిక్లేర్ చేసి ప్రత్యర్థి ముందు 459పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా మాత్రం 250 పరుగులకి ఆలౌటయి.. భారత్ కి ఘన విజయాన్ని కట్టబెట్టింది.