రవీంద్ర జడేజా పై నిషేధం

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. ఇన్నింగ్స్‌ 53 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్‌లో 230 పరుగుల లోటుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టును రవీంద్ర జడేజా (5/152) కుప్పకూల్చాడు.

అయితే ఇపుడీ విజయానందంలో వున్న రవీంద్ర జడేజా కు షాక్ తగిలింది. రవీంద్ర జడేజాపై ఐసీసీ ఒక మ్యాచ్‌ నిషేధం విధించింది. ఐసీసీ క్రికెటర్ల నియమావళి ప్రకారం జడేజా 24 నెలల కాలంలో ఆరు డీమెరిట్‌ పాయింట్లకు చేరుకున్నాడు. రెండో టెస్టులో ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నె క్రీజులో ఉన్నప్పుడు జడేజా అనవసరంగా అతడిపైకి బంతి విసిరాడు. ఫీల్డ్‌ అంపైర్లు ఈ చర్యను ప్రమాదకరమని హెచ్చరించారు. ఇది లెవల్‌-2 తప్పిదం కావడంతో జడేజా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత కూడా విధించారు. ఆగస్టు 12 నుంచి పల్లెకల్‌లో జరిగే మూడో టెస్టు ఆడకుండా నిషేధం విధించారు. సూపర్ ఫామ్ లో వున్న జడేజాకు ఇలా షాక్ తగలడం విరాట్ సేనకు ప్రభావం చూపుతుందేమో చూడాలి.