పర్యాటకుల కోసం ఎలక్ట్రిక్ ఆటోలు..

పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చారిత్రక కట్టడాల వద్ద వాహన కాలుష్యం పెరుగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలియజేసారు. బ్యాటరీ ద్వారా నడిచే ఈ వాహనాల కోసం ఇప్పటికే చార్జింగ్ స్టేషన్లు కూడా నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు , వీటిని చార్జింగ్ చేయడానికి ప్రత్యేక ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్లను కూడా పర్యాటకశాఖ ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణ చార్జీ రూ.250 గా నిర్ణయించారు. 24 గంటల పాటు ఈ ఆటో లో ప్రయాణం చేయవచ్చు. రూ.250 చెల్లించి టికెట్ తీసుకుంటే రోజంతా ఈ వాహనాల్లో నగరంలోని తమకు ఇష్టమైన పర్యాటక ప్రాంతానికి వెళ్లే అవకాశమున్నది. ప్రయాణికులు నిండగానే ఈ ఆటో లు బయలుదేరుతాయి. సాలర్జంగ్ మ్యూజియం నుంచి మొదలుకుని చార్మినార్, జూపార్క్, టూంబ్స్, గోల్కొండ కోట, నగరంలోని ప్యాలెస్‌లు, హుస్సేన్‌సాగర్ వంటి పర్యాటక ప్రాంతాలమీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రోజంతా రాకపోకలు సాగించే వీటి ద్వారా పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు దిగి సందర్శించిన అనంతరం మళ్లీ అక్కడ అందుబాటులో ఉండే మరో వాహనంలో మరో పర్యాటక ప్రదేశానికి వెళ్లవచ్చని అధికారులు తెలియజేసారు.