దసరా సెలవులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్


రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేట్ స్కూళ్లకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుంచి 21వ తేదీ ఆదివారం వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-2019 విద్యా సంవత్సరానికి దసరా సెలవులను ప్రకటించింది. 21న ఆదివారం సెలవు కావడంతో 22 నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభించాలని, సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని పేర్కొంది.

తొలుత 12 రోజులే సెలవులు ప్రకటించినా, ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం కావడంతో 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

అటు దసరాకు ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.