ఎన్టీఆర్ కోసం క్రిష్ పడుతున్న కష్టం చూడండి..

మొదటి సినిమా గమ్యం తోనే తన గమ్యం ఎలాంటిదో అందరికి తెలియజేసిన డైరెక్టర్ క్రిష్. మొదటి సినిమా నుండి కూడా కమర్షియల్ అంశాలు పక్కన పెట్టి సమాజ స్పృతి కలిగిన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే అంటే కమర్షియల్ గా ఆలోచించకుండా సమాజాన్ని మేలుకొల్పే విధంగా ఉంటుందని అంత భావిస్తారు.

ప్రస్తుతం నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా యన్.టి.ఆర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఒకే భాగం లో ఈ బయోపిక్ ను తెరకెక్కించాలని భావించినప్పటికీ ఆ మహానటుడు జీవిత కథ రెండు గంటల్లో చెప్పేది కాదని దానిని రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించాలని డిసైడ్ అయ్యారు. మొదటి భాగాన్ని సినీ కెరియర్ కు సంబంధించి , రెండో భాగాన్ని రాజకీయ కోణం గురించి చూపించబోతున్నారు.

అలాగే మొదటి పార్ట్ కు కథానాయకుడు , రెండో పార్ట్ కు మహానాయకుడు అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసారు. ఇప్పటికే మొదటి పార్ట్ షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీంతో పాటే రెండో పార్ట్ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నాడు క్రిష్. సినిమా, రాజకీయాలు రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ – ఎన్టీఆర్‌ అభిమానుల మనసు నొప్పించకుండా, చరిత్ర వక్రీకరించకుండా ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు క్రిష్.

అలాగే అనుకున్న సమయాన్ని ఈ రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రేయిపగలు కష్టపడుతున్నాడు. తాను ఎంతలా కష్టపడుతున్నాడో తాజాగా చిత్ర వర్కింగ్ స్టిల్స్ ను విడుదల చేసారు. ఈ వర్కింగ్ స్టిల్స్ లలో ‘గుండమ్మకథ’ చిత్రంలోని ‘లేచింది మహిళా లోకం’ అనే పాటను చిత్రీకరిస్తున్నారు . సావిత్రిలా నిత్యమేనన్‌ నటిస్తుంది. క్రిష్‌ సన్నివేశం వివరిస్తుంటే బాలయ్య కూడా ‘అదీ.. అలానే చేయాలి..’ అంటూ నిత్యకి సూచనలిస్తున్నారు. ఈ సన్నివేశాన్ని ‘ఎన్టీఆర్‌ – కథానాయకుడు’లో చూడొచ్చు. దీంతో పాటు మహానాయకుడు పార్ట్ లో భాగంగా ఎన్టీఆర్‌ రాజకీయ ప్రసంగం చేస్తున్న పిక్ ను విడుదల చేసారు. అందులో ఎలా ప్రసంగం చేయాలో బాలయ్య కు క్రిష్ వివరిస్తున్నాడు. మొత్తం మీద క్రిష్ ఈ సినిమా కోసం ఎంత కష్ట పడుతున్నాడో తెలుస్తుంది.

ఎన్.బి.కే బ్యానర్ ఫై నందమూరి బాలకృష్ణ ఈ బయోపిక్ ని నిర్మిస్తుండగా , కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. జనవరి నెలలో ఈ రెండు పార్ట్ లు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.