విజయ్ కి టాక్సీవాలా పై నమ్మకం లేదా ?


విజయ్ దేవరకొండ-యువి క్రియేషన్స్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా టాక్సీవాలా. గీత గోవిందంని ముందే విడుదల కావాలి, కానీ సీజీ వర్క్ సమస్య కారణంగా వెనకబడింది. మరి ఎప్పుడు విడుదలవుతుంది? ఇదీ ప్రశ్న.

విజయ్ ద్విభాషా చిత్రం ‘నోటా’ విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమాను అక్టోబర్ ఆఖరి వారంలో జనం ముందుకు తెచ్చేందుకు నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా సన్నాహాలు చేస్తున్నారు. దాని తరువాత టాక్సీవాలా అంటున్నారు. వాస్తవానికి ఆ మధ్య టాక్సీవాలా విడుదల కాదని, నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల చేస్తారని గ్యాసిప్ లు వినవచ్చాయి. దీనికి కారణం వుంది. అర్జున్ రెడ్డికి ముందు కమిట్ అయిన ఈ సినిమా ఇది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ ఫేం మారిపోయింది. గీత గోవిందం తర్వాత అది మరో రేంజ్ లోకి వెళ్ళింది.

దీంతో టాక్సీవాలా విజయ్ రేంజ్ కి సూట్ అవుతుందా లేదా అన్న అనుమానం వుంది. ఇదే ఈ సినిమా వెనక్కి వెళ్ళడానికి కారణం అని కూడా ఇన్ సైడ్ టాక్. మరి ‘నోటా’ తర్వాత అయినా ఈ సినిమాకి మోక్షం దొరుకుతుందో లేదో చూడాలి.