కళ తప్పిన యూఎస్ బాక్స్ ఆఫీస్..

తెలుగు సినిమాలకు ఓవర్సీస్ అతి పెద్ద మార్కెట్ గా మారింది..చిన్న చిత్రమైన సరే మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుతూ వస్తున్నాయి. కథ బాగుండాలే కానీ దానికి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారు. దీంతో ఓవర్సీస్ మార్కెట్ వద్ద తెలుగు సినిమాలు హావ నడుస్తూ వచ్చింది. కానీ గత రెండు నెలలుగా పూర్తి గా వెలవెల బోతుంది. ఈ ఏడాది రంగస్థలం , భరత్ అనే నేను , మహానటి వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ లాంటి కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటాయి. కానీ మహానటి తర్వాత బాక్స్ ఆఫీస్ కళతప్పింది.

‘సమ్మోహనం’.. ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఇక ప్రతి వారం రెండు మూడు సినిమాలు రిలీజవుతున్నాయే కానీ.. ప్రేక్షకులను అలరించడం లో మాత్రం విఫలం అవుతూ వస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన సాక్ష్యం , హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలు మళ్లీ పూర్వ వైభవం తెస్తాయి అనుకునే అవి కూడా నిరాశనే మిగిల్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సాక్ష్యం’ అక్కడ తేలిపోయింది. శుక్రవారం నేరుగా సినిమాను రిలీజ్ చేయగా.. ఆ రోజు 43 వేల డాలర్లతో పర్వాలేదనిపించింది. కానీ తర్వాతి రోజుకు వసూళ్లు 31 వేల డాలర్లు పడిపోయాయి. ఆదివారం వసూళ్లలో మరింత డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.

ఇక శనివారం విడుదలైన ‘హ్యాపీ వెడ్డింగ్’కు ముందు రోజు ప్రిమియర్లు వేయగా.. 12 వేల డాలర్లే వసూలయ్యాయి. శనివారం 13 వేల డాలర్లొచ్చాయి. ఆదివారం వసూళ్లు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి ఈ వారం కూడా యూఎస్ బాక్స్ ఆఫీస్ బోసిపోయినట్లే..ఇక ఈ వారం బ్రాండ్ బాబు, చి ల సౌ, గూఢచారి వంటి సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాలు యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లు రాబడతాయో చూడాలి.