ఆ తప్పు తర్వాత దిద్దుకోలేము….రిపోర్టర్ కళ్ళు తెరిపించిన అజయ్ దేవగన్

మీటూని ఉద్దేశిస్తూ తనను ఒక ప్రశ్న అడిగిన విలేఖరికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు అజయ్ దేవగన్. అదేంటంటే అజయ్‌ లీడ్ రోల్ లో నటించిన ‘దే దే ప్యార్‌దే’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌ కీలక పాత్రలో నటించారు. అయితే కేసు నడుస్తున్నప్పటికీ అలోక్‌ను సినిమాలో నటింప చేయడం కరెక్ట్ ? అంటారా. అని ఒక విలేఖరి అజయ్ ని ప్రశ్నించారు.

ఇందుకు అజయ్‌ స్పందిస్తూ ఆరోపణలు ఎదుర్కోవడం వేరు, దోషులుగా నిరూపితమవడం వేరని అన్నారు. దోషిగా తేలిన వ్యక్తితో కలిసి పనిచేయడం నూటికి నూరు శాతం తప్పే, కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి అవకాశాలు ఇవ్వకపోవడం కూడా అంతే తప్పని అన్నారు. అలా చేస్తే వారి కుటుంబాలు ఏమైపోతాయో ఆలోచించండని ఎదురు ప్రశ్నించారు. మీటూ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నటుడి గురించి నాకు తెలుసు. అతని కుమార్తె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తన తండ్రిపై ఆరోపణలు వస్తుండడం తట్టుకోలేక స్కూల్‌కి వెళ్లడం, తినడం మానేసింది.

వారి కుటుంబం చాలా బాధపడుతోంది. ఒకవేళ మీరు అన్నట్లు అలోక్‌నాథ్‌ మీటూలో దోషిగా తేలితే జీవితంలో అతని ముఖం చూడను. కానీ ఆరోపణలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అతనికి పని ఇవ్వకపోతే ఆయన కెరీర్‌ నాశనమవుతుంది. ఆ తర్వాత కేసులో అతను నిర్దోషి అని తేలితే ఆ తప్పును మనం సరిదిద్దుకోలేని పరిస్థితి వస్తుంద‌ని అజయ్ చెప్పుకొచ్చాడు. ఆయన చెప్పిందీ నిజమే కదా…ఈరోజున జరుగుతున్న పరిస్థుతులలో ఎవరు ఏమి చెప్పినా నమ్మలేని విధంగా ఉన్నాం.