‘అక్కినేని’ ఇమేజ్ తో ఇబ్బంది పడుతున్న అఖిల్


అక్కినేని మూడో తరం నుండి వచ్చిన హీరో అఖిల్. చూడ్డానికి బావుంటాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అఖిల్ పై బోలెడు అంచనాలు. ఆ అంచనాలకు తగ్గట్టే బ్రాండ్ అంబాసిడర్ గా కొన్ని ఉత్పత్తులని ప్రమోట్ చేసి ఎంట్రీకి ముందే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అఖిల్. ఒక దశలో అఖిల్ బ్రాండ్ జోరు చూస్తే మహేష్ బాబు ని బీట్ చేయగల సత్తా వున్న స్టార్ గా వార్తల్లో నిలిచాడు. అయితే అఖిల్ వెండితెర ఎంట్రీ మాత్రం దెబ్బకొట్టేసింది. ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేశాడు అఖిల్. ఈ మూడు కూడా ఒక్క విజయాన్ని ఇవ్వలేకపొయాయాయి.

ఈ పరాజయాలకు కారణాలు వెదికితే మాత్రం.. అఖిల్ ఇమేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని అర్ధం చేసుకోవచ్చు. మొదటి సినిమా అఖిల్ లో.. అతన్ని ఓ సూపర్ హీరోగా చూపించారు. ఇది దారుణంగా దెబ్బ కొట్టింది. అక్కినేని హీరో కాబట్టి మొదట్లోనే మాస్ హీరోగా నిలబెట్టేయాలనే ప్రయత్నం కనిపించింది. కానీ అఖిల్ లో ఆ రేంజ్ హీరోయిజం ని తట్టుకోలేకపోయారు జనాలు. ఒక వ్యక్తిని సూపర్ హీరోగా చూపించేముందు అతడి బలాబలాలు తెలియాలి. చిరంజీవి ‘ఖైదీ’ సినిమా వరకూ మెగాస్టార్ కాలేదు. అలాంటింది కేవలం అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరో కనుక మొదటి సినిమానే సూపర్ హీరోగా చూపేయడం ప్రేక్షకులకు ఎదోలా అనిపించింది.

రెండో సినిమా ‘హలో’ ని విక్రమ్ కుమార్ కి వదిలేశాడు అఖిల్. అంతకుముందు అక్కినేని హీరోలతో ‘మనం’ లాంటి కాల్సిక్ సినిమా తీసిన దర్శకుడు విక్రమ్. అయితే హలో ని మాత్రం చాలా సాదాసీదాగా తీసేశాడు. ఇందులో అఖిల్ నటన ఓకే అనిపించినా కోరుకుంటున్న విజయం మాత్రం దక్కలేదు. అయితే ఈ సినిమాలో చేసిన ఓ మేలు మాత్రం వుంది. ఇందులో అఖిల్ కి ఎలాంటి ఇమేజ్ చొప్పించలేదు.

అయితే మూడో సినిమా మిస్టర్ మజ్ను విషయానికి వచ్చేసరికి మళ్ళీ అక్కినేని ఇమేజ్ తో పెట్టుకున్నారు. అక్కినేని అంటే లవర్ బాయ్ ఇమేజ్ వుంటుంది. అఖిల్ కి ఈ సినిమాలో ఓవర్ డోస్ వేసుకొని చూపించారు. కానీ జనాలు కనెక్ట్ కాలేదు. కారణం అక్కినేని హీరోలకు లవర్ బాయ్ ఇమేజ్ వున్న మాట వాస్తవం. అయితే ఇది వాళ్ళు చేసిన పాత్రల ద్వారా వచ్చింది కానీ కుటుంబం ద్వార వచ్చింది కాదు. ఈ లాజిక్ మిస్ అయ్యారు. అఖిల్ కి ఆల్రెడీ లవర్ బాయ్ ఇమేజ్ వున్న వాడిగా చూపించారు. సినిమా విడుదల అయ్యాక తెలిసింది. ఆ ఇమేజ్ ఇంకా రాలేదని.

మొత్తంమ్మీద ఇమేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు అఖిల్. వీటన్నిటిని దాటి అఖిల్ కి ఇండస్ట్రీలో నిలబడిపోయే హిట్ ఎవరు ఇస్తారో చూడాలి మరి.