బిగ్ బాస్ 2 హౌస్ లోకి ప్రముఖ యాంకర్ ఎంట్రీ..

తెలుగు బిగ్ బాస్ 2 రోజురోజుకు విశేష ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా ఆరో వారం లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ సైతం ప్రేక్షకులకు , అలాగే హౌస్ సభ్యులను మరింత ఉత్సహం నింపేందుకు సరికొత్త టాస్క్ లతో రంజింపజేస్తున్నాడు. బిగ్ బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా మంగ‌ళ‌వారం కూడా ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ షూటింగ్ ఆట పాటలతో చాల హుషారుగా సాగింది. డైరెక్ట‌ర్ అమిత్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ దీప్తి, కెమెరా మెన్ రోల్ రైడాలు ఆర్టిస్టుల‌తో న‌వ‌ర‌సాలు పండిస్తూ షూటింగ్ రంజిపచేసారు. మ‌ధ్య మధ్య‌లో ప్రొడ‌క్ష‌న్ చీఫ్‌గా ఉన్న బాబు గోగోనేని నన్ను హీరోగా పెట్టుకోండని డైరెక్ట‌ర్‌కి టీం చెప్ప‌డం, హీరోల‌పై స‌ర‌దా కామెంట్స్ చేయడం వంటి సంఘ‌ట‌న‌లు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించాయి.

ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా కొత్త సెలబ్రిటీల ఎంట్రీ ఉంటుందనే సంగతి తెలిసిందే. సీజన్ వన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా నవదీప్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి ఎలాంటి రచ్చ చేసాడో తెలియంది కాదు.. తాజాగా ఈ సీజన్ 2 లో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారనే ఆసక్తి తెరపడింది. తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ మెయిల్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్..తాజాగా బిగ్ బాస్ 2 హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఈరోజు విడుదల చేసారు.

ప్రదీప్‌ను చూసిన సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రదీప్‌ రాగానే అందరూ హత్తుకుని అతనికి ఆహ్వానం పలికారు. ప్రదీప్ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే.. వారం రోజుల్లో పంపించేస్తాం అని తేజస్వి అనగానే ఇంకా హౌస్ లోకి అడుగుపెట్టలేదు అప్పుడే పంపిస్తారా అంటూ ప్రదీప్ అన్నాడు. మీ వాడిని మీలో ఒకడిని కాబట్టి మీలాగ ఇక్కడికి ఖాళీ చేతులతో రాదలచుకోలేదని చెప్పి, ఒక్కొక్కరి గురించి చెబుతుండగా.. కంటెస్టెంట్లు అందరూ కంటతడి పెట్టుకున్నారు. పోను పోను నేను పోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తానని ప్రదీప్‌ పేర్కొన్నారు.