హరీష్ బాధ అంతాఇంతా కాదు…

గబ్బర్ సింగ్ చిత్రం స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న హరీష్ శంకర్..ఆ తర్వాత ఆ తరహా విజయాన్ని మాత్రం ఇంతవరకు అందుకోలేదు. గబ్బర్ సింగ్ తర్వాత రామయ్య వస్తావయ్యా , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే చిత్రాలు దిల్ రాజు బ్యానర్ లో చేసాడు. ఈ మూడు కూడా పెద్దగా విజయ డంఖా మోగించలేకపోయాయి. అయినాగానీ దిల్ రాజు – హరీష్ తో సినిమా ప్లాన్ చేసాడు. తాజాగా దిల్ రాజు తాను నిర్మించిన లవర్ చిత్ర ప్రమోషన్ లలో హరీష్ సినిమా ప్రస్తావించకపోవడం కాస్త హరీష్ ను బాధకు గురి చేసింది.

రాజ్ తరుణ్ తో దిల్ రాజు నిర్మించిన `ల‌వ‌ర్‌` రేపు (జులై 20) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యం లో రిలీజ్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దిల్‌రాజు త‌న సినిమాల రిలీజ్ తేదీల్ని ప్ర‌క‌టించారు. నితిన్ `శ్రీ‌నివాస క‌ళ్యాణం` ఆగస్టు 9న, రామ్ సినిమా `హలో గురు ప్రేమ కోసమే` దసరా కానుకగా అక్టోబర్ 18న, వెంకీ-వ‌రుణ్‌తేజ్ మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్ 2` జ‌న‌వ‌రి 12న, 2019 ఏప్రిల్ 25న మ‌హేష్ సినిమా రిలీజ్ చేస్తాం అంటూ తెలిపాడు. ఆ క్ర‌మంలోనే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోని `దాగుడు మూత‌లు` ప్ర‌స్తుతానికి వాయిదా ప‌డింద‌ని దిల్ రాజు హింట్‌ ఇచ్చారు. దీనిపై కాస్తంత నిర్వేదం ఫీలైన హ‌రీష్ సామాజిక మాధ్య‌మంలో స్పందిస్తూ..“ఈ జాబితా నుంచి నా సినిమా మిస్స‌యింది. కాస్త ఇబ్బందిక‌రంగానే ఉంది. కానీ కొన్నిసార్లు కొన్ని త‌ప్ప‌వు.. అయితే ఆ ఐదు సినిమాల రిలీజ్‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు చెబుతున్నా“ అని అన్నారు.