ఉదయం 11 గంటల్లోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

నగరంలో గణనాథుల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పకడ్బందీగా హైటెక్ ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం గణనాథుని నిమజ్జనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడిన డీజీపీ.. 31 జిల్లాల్లో వినాయక నిమజ్జనం ప్రక్రియను డీజీపీ కార్యాలయం నుండి లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో లోతయినా చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత గల ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం రేపు(ఆదివారం) ఉదయం 11 గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. నేడు(శనివారం) అర్థరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణేష్ ట్రాలీ వెల్డింగ్ పనులు ప్రారంభం అవుతాయి. ఆ తరువాత ఉదయం 4 గంటలకు ట్రాలీపైకి గణేషుణ్ణి ఎక్కిస్తారు. ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. . మొత్తంగా 11 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.