ఎన్టీఆర్ బయోపిక్ @శ్రీకాకుళం

ఎన్టీఆర్‌ జీవిత కథని ‘ఎన్టీఆర్‌’ పేరుతో బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతుంది. శ్రీకాకుళంలో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 4 నుంచి శ్రీకాకుళంలో ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లానే ఎంపిక చేయడానికి ఓ కారణం ఉంది. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ లో అత్యంత కీలకమైన ఘట్టం చైతన్య రథ యాత్ర. ఈ ఎపిసోడ్ చిత్రీకరణకు సంబంధించి శ్రీకాకుళాన్ని వేదికగా ఎంచుకుంది యూనిట్. కాగ, ఈ సినిమాలో బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. అలాగే చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఎన్టీఆర్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. దీనికి కారణం వుంది. 1983లో సరిగ్గా అదే రోజున ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.