టీజర్ టాక్ ఓ బేబీ …’ఓ’ వేసుకోవాల్సిందే

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న క్రేజీ బ్యూటీ సమంత..ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్లో “ఓ బేబీ” చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొరియన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సమంత ఒక వయసు మళ్ళిన లేడీ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి ఓ అనిపించారు.

లక్ష్మి తన జ్ఞాపకాలను తలుచుకుంటూ టీజర్ ఓపెన్ చేసారు. ఇంతలో ఆ బామ్మ 20 ఏళ్ల సమంతలా మారిపోతుంది. సమంత రూపంలో ఉన్న బామ్మ తన జ్ఞాపకాలను నాగశౌర్యతో పంచుకుంటూ ఉంటుంది. చిన్న వయసులో ఉండగానే పెళ్లయింది. వయసు వచ్చే సరికి ఇద్దరు పుట్టేశారు. వాళ్ళను పెంచి పెద్ద చేసే సరికి నావయసు అయ్యిపోయింది. నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని సమంత చెప్పగానే నాగశౌర్య షాక్ అవుతాడు.

టీజర్ చివర్లో నాతో ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు… ఒక్కొక్కరికి అనే డైలాగ్ ఆకట్టుకుంది. పూర్తిస్థాయిలో ఫన్ టు ఫన్ గా సినిమాను తెరకెక్కించారని స్పష్టం అవుతున్నది. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలి ఆత్మ, 20 ఏళ్ల వయసున్న యువతి శరీరంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంతో ఈ మూవీ వస్తోంది.

ఇటీవలే ఓ బేబీ ఫస్ట్ లుక్‌లో సమంతతోపాటు, సీనియర్ నటి లక్ష్మీ కూడా కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.