సైరా…. ఇప్పుడు లాభం లేదురా..


సైరా సినిమాని మెచ్చుకున్నారు. బావుందన్నారు. కానీ రోజులు గడిస్తే తెలిసింది. సినిమాకి డబ్బులు రాలేదు. బిజినెస్ పరంగా బాక్సాఫీసు దగ్గర సైరా యావరేజ్. ఇది నిజం. సినిమా కొనుక్కున్న బయ్యర్లు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హడావిడి చేస్తున్నారు. మొన్న ఏపీ సిఏం జగన్ ని కలిశారు. నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యని కలసి సైరా గురించి మాట్లాడించారు.

అయితే దిని వల్ల ఏంటి లాభం అంటే.. ఏమీ లేదనే చెప్పాలి. కారణం సినిమాకి పబ్లిసిటీ వేడిలో ఉన్నప్పుడే చేయాలి. సైరా వేడి దిగిపోయింది. సినిమా స్టామినా అయిపొయింది. ఇప్పుడు వంద జాకీలేసి లేపిన లేవదు. మొదటి నుండే సైరా పబ్లిసిటీపై పెద్ద ఫోకస్ చేయలేదు. మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కనీసం నాలుగు పేపర్లని పిలిచి మాట్లాడలేదు. రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ ని తెచ్చి ఓ ఇంటర్వ్యూ ని పులిహోర కలిపారు కానీ అది భజన అనే సంగతి అందరికీ అర్ధమైయింది. దాని వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత, థియేటర్లు ఖాళీ అయిపోయిన తర్వాత సైరా సైరా అంటు తిరుగుతున్నారు మెగాస్టార్. అన్నీ పొలిటికల్ టూర్లే కాబట్టి .. మరో ప్రయోజనం కోసం ఆయన తిరుగుతున్నాడని అనుకోవాలే గానీ సినిమా గురించి అయితే కాదు.