సర్కార్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

విజయ్ – మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.

దీపావళి కానుకగా రేపు ( నవంబర్ 6న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనే లేదు. గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో ‘తుపాకి’, ‘కత్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో లో సినిమా వస్తుండడం తో ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని విజయ్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ను ప్రముఖ యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఇచ్చేసాడు. విజయ్ మాస్ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగానే అన్ని మసాలాలు ‘సర్కార్’లో ఉన్నాయని ట్వీట్ చేశారు. సోషల్ మెసేజ్, అదిరిపోయే మ్యూజిక్, మురుగుదాస్ దర్శకత్వ ప్రతిభ కలుపుకుని ‘సర్కార్’ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని , సినిమా మొదటి నుంచి చివరి వరకు మొత్తం విజయ్‌ షోనే అని.. ఫైట్లు, పటిష్టమైన కథ, డ్యాన్సులు, పంచ్ డైలాగులు విజయ్‌లోని మాస్ ఎఫెక్ట్‌ను చూపించాయన్నారు.

ఇక ఈ రివ్యూ పట్ల కొంతమంది అభిమానులు పండగ చేసుకుంటుంటే , మరికొద్ది మంది మాత్రం ఖంగారు పడుతున్నారు. చాలాసార్లు ఉమైర్ ఇచ్చిన రివ్యూ లు తేడా కొట్టడం తో ఈయన రివ్యూ ను నమ్మాలో , నమ్మకూడదో అర్ధం కావడంలేదని అభిమానులు వాపోతున్నారు. మరి ఉమైర్ చెప్పినట్లు సినిమా ఉందా..లేదా అనేది రేపు తెలుస్తుంది.