రివ్యూ : ఉల‌వ‌చారు బిరియానీ

Ulavacharu-Biryani-telugu-movie-review-rating                                        |Click here for English Review|

                                              టేస్ట్ స‌రిపోలేదు– తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5
వెళ్ల‌క వెళ్ల‌క బంధువులింటికి వెళ్తారు. అతిధ్యం అదిరిపోతుంది… అన్న‌ది మీ ఫీలింగ్. పంచ‌భ‌క్ష ప‌ర‌మ‌న్నాల‌తో విందు భోజ‌నాలు పెడ‌తార‌న్న‌ది మీ ఫాంట‌సీ. వాళ్లూ పెట్ట‌గ‌ల స‌మ‌ర్థులే. మీపై అంత ప్రేమ కూడా ఉంది. కానీ… మీకు ఇష్టం లేని కాక‌ర‌కాయ వేపుడు, మీక‌స్స‌లు ప‌డ‌ని క్యాలీఫ‌ర్ కూర వేసి `తింట‌రా తిన‌రా…` అంటూ నోట్లో వేసి కుక్కితే ఎలా ఉంటుంది..? అచ్చం – ఉల‌వ‌చారు బిరియానీలా ఉంటుంది.

ప్ర‌కాష్ రాజ్ అంటే ఒక విధ‌మైన గౌర‌వం. న‌టుడిగానే కాదు. ద‌ర్శ‌కుడిగానూ. ధోనీ.. ఎంత మంచి సినిమా. డ‌బ్బులు రాలేదుగానీ ప్ర‌సంశ‌లు మాత్రం బాగానే ద‌క్కాయి. నిర్మాత‌గా ఆకాశ‌మంత ఎంత బాగా తీయించాడు. అందుకే అత‌ని సినిమా అంటే ఓర‌క‌మైన న‌మ్మ‌కం! బాగానే తీస్తాడ‌న్న భ‌రోసా. పైగా ఎలాంటి టైటిల్ పెట్టాడు..?? ఉల‌వ‌చారు బిరియానీ అని. ఇళ‌యరాజా పాట‌లతో తాళింపు వేసి సిద్ధం చేశాడు. అందుకే ఈ సినిమాపై ఇంకొంచెం న‌మ్మ‌కం ఎక్కువైంది. అలాంటి న‌మ్మ‌కాలు మోసుకొంటూ – తృప్తిగా భోం చేద్దాం అని ఈ సినిమాకెళ్తే ప్ర‌కాష్‌రాజ్ ఉడికీ ఉడ‌క‌ని ప‌దార్థాలు వ‌డ్డించాడు.

క‌థ‌లోకి వెళ్తాం. కాళిదాసు (ప్ర‌కాష్‌రాజ్‌) భోజ‌న ప్రియుడు. ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తుంటాడు. న‌ల‌భై ఐదేళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. చేసుకొందామ‌నుకొంటాడు గానీ.. సంబంధాలు కుద‌ర‌వు. మ‌రోవైపు గౌరీ (స్నేహ‌) క‌థ‌. ఆమె ఓ డ‌బ్బింగ్ క‌ళాకారిని. కుజ‌దోషం. పెళ్లి సంబంధాలు త‌ప్పిపోతుంటాయి. ఇంట్లోవాళ్లు ఏ వ‌య‌సులో జ‌ర‌గాల్సిన ముచ్చ‌ట ఆ వ‌య‌సులోనే జ‌ర‌గాలి అని పోరు పెడుతుంటారు. ఓ రాంగ్ కాల్ వ‌ల్ల ఫోనులోనే కాళిదాసు, గౌరి మ‌ధ్య స్నేహం మొద‌ల‌వుతుంది. చూసుకోకుండానే ఒక‌రిపై ఒక‌రు ఇష్టం పెంచుకొంటారు. ఓ కాఫీ క్ల‌బ్బులో క‌లుసుకొందాం అనుకొంటారు. తీరా ఆ స‌మ‌యానికి కాళిదాసుకి ఓ అనుమానం వేస్తుంది. నాకా యాభై ద‌గ్గ‌ర ప‌డ్డాయి. జుత్తు నెరిసిపోయింది. ఇప్పుడా అమ్మాయి కాదంటే ప‌రిస్థితి ఏమిటి?? అన్న అనుమానం వెంటాడుతుంది. అందుకే త‌న స్థానంలో త‌న మేన‌ల్లుడిని కాళిదాసుగా పంపుతాడు. మ‌రోవైపు గౌరి కూడా అలానే ఆలోచిస్తుంది. అందుకే త‌న స్థానంలో త‌న చెల్లాయిని కాపీ షాప్‌కి పంపుతుంది. ఈ క్ర‌మంలో ఈ రెండు జంట‌ల క‌థ ఏమ‌లుపు తిరిగింది?? ఈ క‌థ‌లో ఎంత గంద‌ర‌గోళం ఎదురైంది?? అన్న‌దే ఉల‌వ‌చారు బిరియానీ స్టోరీ.

క‌థ చాలా చాలా సింపుల్‌గా ఉంది. ఇంట్ర‌వెల్ ద‌గ్గ‌రే త‌రువాతి క‌థ ఎలా వెళ్తుంది? ఏం జ‌ర‌గ‌బోతోంది?? అన్న‌ది అంచ‌నా వేయొచ్చు. ఇలాంటి క‌థ‌ల్లో ట్విస్టుల కంటే.. క‌థాగ‌మ‌న‌మే ముఖ్యం. దాన్ని సాధ్య‌మైనంత సాఫీగా, హాయిగా.. ఆహ్లోద‌క‌రంగా తీయాలి. కానీ ప్ర‌కాష్‌రాజ్ లేని కాంప్లికేష‌న్స్ కొని తెచ్చుకొని తానే గంద‌ర‌గోళానికి గుర‌య్యాడు. సెకండాప్‌లో ద‌ర్శ‌కుడు చెప్ప‌డానికి ఏమీ మిగ‌ల్లేదు ప్ర‌కాష్‌రాజ్ – స్నేహ‌ల జంట సైడ్ అయిపోతుంది. కుర్ర ప్రేమ జంట క‌థ మొద‌ల‌వుతుంది. వాళ్ల మ‌ధ్య‌స‌న్నివేశాల్ని ఫ్రెష్ గా రాసుకొంటే బాగుండేది. కానీ ఈ విష‌యంలోనూ ప్ర‌కాష్‌రాజ్ విఫ‌ల‌మ‌య్యాడు.

సినిమా ప్రారంభం, ఎత్తుగ‌డ‌… క‌థ‌లోకి వెళ్లిన విధానం ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి. ఎప్పుడైతే ఫోనుల్లో ప్రేమ వ్య‌వ‌హారం మొద‌లైందో అక్క‌డి నుంచి బండి బాగా స్లో అయిపోయింది. ఎప్పుడూ వంట‌ల ప్ర‌స్తావ‌నే. రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మయంలో ఓ ప్రియురాలు త‌న ప్రియుడి కోసం కేక్ ఎలా వండింది?? అనే విష‌యాన్ని ప‌ది నిమిషాల పాటు సాగ‌దీసి చెప్పారు. అక్క‌డ సినిమా మొత్తం డౌన్ అయిపోయింది. ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత ఒక్క‌టైపోతే వ‌చ్చే స‌మ‌స్యే ఇది. తాను రాసుకొన్న ప్ర‌తీ స‌న్నివేశం అద్భుతం అనుకొని.. తీసేస్తాడు ద‌ర్శ‌కుడు. ఎడిట‌ర్‌కి క‌త్తెర వేసే అవ‌కాశం కూడా ద‌క్క‌దు. అలాంట‌ప్పుడు సినిమా స్లో అవ్వ‌కుండా ఎలా ఉంటుంది?? ఇంట్ర‌వెల్ త‌ర‌వాత ఆ స‌మ‌స్య మ‌రింత జ‌టిల‌మైంది. ఏదో మ‌హా కావ్యం చెక్కుతున్న‌ట్టు ద‌ర్శ‌కుడు ఈ సినిమాని చెక్కుకొంటూ పోయాడు. `వీళ్లు క‌లిసిపోతే బాగుండును.. పీడ విర‌గ‌డైపోతుంది..` అని ప్రేక్ష‌కుడు అనుకొన్నంత వ‌ర‌కూ సినిమాని తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర‌వాత కాళిదాసు – గౌరి ఒక్క‌టైపోయినా ప్రేక్ష‌కుల్లో ఏ ఫీలింగూ ఉండ‌దు. బ‌తుకు జీవుడా.. అంటూ బ‌య‌ట‌కు రావ‌డం త‌ప్ప‌.

ప్ర‌కాష్‌రాజ్‌, స్నేహా, ఊర్వ‌శి, ఎమ్మెస్‌… ఇలా అంద‌రూ ఎవ‌రి పాత్ర‌ల్లో వాళ్లు చ‌క్క‌గా ఇమిడిపోయారు. వంక పెట్టే అవ‌కాశం కూడా లేదు. ఆఖ‌రికి కొత్త జంట కూడా ముచ్చ‌ట‌గానే ఉంది. ఇళ‌య‌రాజా పాట‌లు మ‌హాద్భుతం అన‌లేం గానీ – రెండు మూడు పాట‌లు బాగున్నాయి. వాటిని అందంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఈ జ‌న్మ‌నే రుచి చూడ‌డానికి దొరికెరా.. పాట‌లో ఎన్నో రుచుల్ని `చూసే` అవ‌కాశం ద‌క్కింది. అక్క‌డ ప్రేక్ష‌కుల నోరూర‌డం ఖాయం. ఫొటోగ్ర‌పీ కూడా చాలా నీట్ గా ఉంది. న‌టుడిగా రాణించిన ప్ర‌కాష్ రాజ్ ద‌ర్శ‌కుడిగా, స్ర్కీన్ ప్లే ర‌చ‌యిత‌గా రాణించ‌లేక‌పోయాడు. సినిమాలో వేగం లేదు. అంటే సీన్స్ సరిగా పండ‌లేద‌నేక‌దా అర్థం. ఒక్కో సీన్ నాలుగైదు నిమిషాల పాటు సాగుతుంది. దాంతో .. ప్రేక్ష‌కుల్లో అస‌హ‌నం మొద‌ల‌వుతుంది. సీన్ కొత్త‌గా ఉండాలి, లేదంటే షార్ప్‌గా ఉండాలి. ఈ రెండూ లేక‌పోవ‌డం వ‌ల్ల సినిమా మొదలైన అర‌గంట‌కే బోర్ కొట్టేస్తుంది.

సింపుల్ క‌థ‌ని, అనుకొన్నంత సింపుల్‌ గా తీయ‌లేక లేనిపోని కాంప్లికేష‌న్స్ కొని తెచ్చుకొన్నాడు ప్ర‌కాష్‌రాజ్‌. రుచి క‌ర‌మైన వంట‌కు అన్నీ సిద్థం చేసుకొన్నాడు గానీ.. ఆ వంట‌కంతో వారెవా అనిపించ‌లేక‌పోయాడు. మొత్తానికి టేస్ట్ లెస్ బిరియానీ వ‌డ్డించాడు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5                          – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

|Click here for English Review|