55 ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన వంతెన … ఇప్పుడు బయట పడింది

ఐదున్నర దశాబ్దాల క్రితం అప్పటి తూఫాన్ దాటికి సముద్ర గర్భంలో కలిసిపోయిన వంతెన ఒకటి ఇన్నేళ్ల తరువాత బయటపడటంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. వివరాలలోకి వెళితే తమిళనాడు కు తూర్పు తీరాన రామేశ్వరం దీవి దక్షిణ అంచున ఉన్న చిన్న గ్రామం ధనుస్కోడి . 1914 లో రామేశ్వరం – ధనుస్కోడి మధ్యన రహదారి ఉండేది . ఈ రహదారిని హైవే గా మార్చి ధనుస్కోడి వద్ద తీరాన్ని ఆనుకొని 20 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవైన వంతెనను ఆ తరవాతి కాలంలో నిర్మించారు. సిమెంట్ పిల్లర్లు వేసి రక్షణ గోడతో వంతెన నిర్మించారు. ఈ వంతెన చాలా సంవత్సరాలు సేవలందించింది . కాగా 1964 భారీ తూఫాన్ దాటికి సముద్రం పొంగి ముంచేయడంతో ధనుస్కోడి వద్ద తీరంలో ఉన్న వినాయక ఆలయం , రైల్వే స్టేషన్ ఇంకా పలు భవన నిర్మాణాలతో పాటు ఈ వంతెన కూడా సముద్రంలో కలిసిపోయింది . పెద్ద ఎత్తున ఇసుకమేటలు పేరుకుపోవడంతో వంతెనతో పాటు రహదారి కూడా కనుమరుగైపోయింది .

2017 లో కేంద్ర ప్రభుత్వం 60 కోట్ల వ్యయంతో ధనుస్కోడి కి ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించింది. కాగా అప్పట్లో సముద్రంలో కలిసిపోయిన వంతెన ఇసుక కోతతో మళ్ళీ ఇన్నేళ్లకు బయటపడింది .వంతెన సిమెంట్ పైపులు,రక్షణ గోడ చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం .