చారిత్రక టెస్ట్ కు ఈడెన్‌గార్డెన్స్ వేదిక

ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్ట్ ఆడే ప్రతిపాదనకు అంగీకరించినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌లో తొలి డే/నైట్‌ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టును ఫ్లడ్ లైట్ల కింద నిర్వహించాలన్న బీసీసీఐ ప్రతిపాదనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీరించిన సంగతి తెలిసిందే.

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నవంబర్‌ 22న భారత్‌తో బంగ్లాదేశ్‌ డే/నైట్‌ టెస్టు తలపడనున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు అందుకున్న గంగూలీ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును డే/నైట్‌ టెస్టు ఆడాలని విజ్ఞప్తి చేశాడు. మొదట బంగ్లా క్రికెటర్లు డే/నైట్‌ టెస్టును వ్యతిరేకించినా బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు వారితో సమావేశమై ఒప్పించింది. భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది.