కవి శేఖర గురజాడకి జయంతి నివాళి


దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అనే గీతం తెలుగు జాతి ఉన్నంత కాలం నిలిచి పోతుంది. అటువంటి గీతాన్ని మనకు అందించిన మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి నేడు. ఆయన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడికి నాంది పలికిన కవి గురజాడ అని అన్నారు. కఠిన పదబంధాలతో కూడిన తెలుగుసాహిత్యాన్ని వాడుక భాషతో గురజాడ పరుగులు పెట్టించారని తెలిపారు. కన్యాశుల్కం నాటకం నేటికీ వన్నె తగ్గలేదని, సాంఘిక దురాచారాలపై గురజాడ అక్షరాగ్ని కన్యాశుల్కం నాటకమని పేర్కొన్నారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం ద్వారా బాల్యవివాహాలను, సంఘ సంస్కరణలకు మానవతా పరిమళాలు అద్ది రచనలు చేసిన మహనీయుడు గురజాడ అని సీఎం చంద్రబాబు కొనియాడారు.

గురజాడ అప్పారావు గారు సెప్టెంబర్ 21, 1862వ సంవత్సరం, విశాఖపట్నం జిల్లా ,ఎలమంచిలి తాలూకా, రాయవరం గ్రామంలో వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు జన్మించారు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ఆ తరువాత గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కము నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు. ఆయన 1892 లో గురజాడ వారి కన్యాశుల్కము నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది.

1910 లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. ముఖ్యంగా గురజాడ రచనల్లో కన్యాశుల్కము (నాటకం) అగ్రగణ్యమైనది. ఆయనకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది. తెలుగు మిర్చి తరుపున ఇదే మా నివాళి.