అద్భుత దృశ్యం : మకరజ్యోతి దర్శనం


శబరిమల అయ్యప్ప కొండపై అపురూప ఘట్టం. ’స్వామియే శరణమయ్యప్ప‘ అంటూ అయ్యప్ప స్వాములు చేసిన శరణుఘోషతో శబరి గిరులు మారు మ్రోగుతుండగా.. మకరజ్యోతి రూపంలో భక్తులకు అయ్యప్ప దర్శనమిచ్చాడు. భక్తజనం పులకించిన పొన్నాంబలమేడు కొండపై అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వంతో పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగిపోయాయి. మకరజ్యోతి దర్శనం కోసం శబరిగిరులకు భక్తులు పోటెత్తారు.

పంబానది, సన్నిధానం, హిల్‌టాప్‌, టోల్‌ప్లాజా తదితర ప్రాంతాల్లో మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మకర జ్యోతి నేపథ్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘట్టంలో భాగంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఆభరణాలను సన్నిధానానికి తరలించారు. 6. 30 గంటలకు తిరువాభరణ ఘట్టం పూర్తయిన వెంటనే.. అయ్యప్ప స్వామి పొన్నాంబలమేడు కొండ మీద నుంచి మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.