కొత్త రూ. 100 నోటు ఫీచర్లు తెలుసా..?

ఇప్పటికే కొత్త రెండువేల నోటు, ఐదు వందల నోటును తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి త్వరలో కొత్త రూ.100 నోటును తీసుకరాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నోటు ఫీచర్లు ఏంటి..? భద్రత ఎలా ఉంది..అనేది అందరిలో కలుగుతున్న సందేహాలు. తాజాగా వీటికి సంబంధించిన ఫీచర్లు, భద్రతలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది.

మహాత్మాగాంధీ సిరీస్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ నోటు వెనుక భాగంలో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘రాణి కీ వావ్’ కనిపించనుంది. లావెండర్ కలర్‌లో ఈ నోటు ఉండనుందని ఆర్‌బీఐ చెపుతుంది. అలాగే ఈ నోటు 142 మిల్లీ మీటర్ల పొడవు, 66 మి.మీ. వెడల్పుతో ఉండనుందట. నోటు ముందు భాగంలో 100 అంకె ఉండగా, దేవనాగరి లిపిలోనూ ఇది ఉంటుందట. మిగతా నోట్ల తరహాలోనే మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఆర్‌బీఐ, ఇండియా హిందీలో భారత్, 100 అనే అక్షరాలను పొందుపరిచారు.

గాంధీ ఫొటోకు కుడివైపున ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. కుడివైపు అశోకుడి నాలుగు సింహాలు… గాంధీ, 100 సంఖ్యల వాటర్ మార్క్ ఉంటాయని తెలుస్తుంది. నోటు వెనుక భాగం విషయానికి వస్తే స్వచ్ఛ భారత్ లోగో, నినాదం ఉంటుంది. రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషల్లో వంద రూపాయలు అని రాసి ఉంటుందట. రాణి కి వావ్ చిత్రం, దేవనాగరి లిపిలో १०० అని రాసి ఉంటుందట. మొత్తం మీద ఈ కొత్త రూ. 100 నోటు భారీ భద్రతలు ఉన్నట్లు అర్ధం అవుతుంది.