ప్రపంచంలోనే తొలిసారిగా కాలు కోల్పోయిన పులికి కృత్రిమ అవయవం

వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకు పోయి కాలు కోల్పోయిన ఓ పులికి వైద్యులు శస్త్రచికిత్స చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చిన అరుదైన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వెలుగుచూసింది. నాగపూర్ ప్రాంతానికి చెందిన సాహెబ్ రావు అనే ఓ పులి 2012 ఏప్రిల్ 26వతేదీన చంద్రాపూర్ జిల్లా తాడోబా అంథేరి పులుల అభయారణ్యంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన వలలో చిక్కి కాలు కోల్పోయింది.ఆర్ధపెడిక్ సర్జన్ సుష్రుత్ బాబుల్కర్, పశువుల డాక్టర్ శిరీష్ ఉపాధ్యాయ్, మహారాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యవిభాగ సైన్సు యూనివర్శిటీ, వన్యప్రాణి పరిశోధన, శిక్షణ కేంద్రం, ఐఐటీ బాంబే నిపుణులు కలిసి ఎడమకాలు కోల్పోయిన పులికి శస్త్రచికిత్స చేసి కృత్రిమ కాలిని అమర్చారు. గోరేవాడ పునరావాస కేంద్రంలో పులికి శస్త్రచికిత్స చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చారు. ఈ శస్త్రచికిత్సలో అటవీ అభివృద్ధి సంస్థ అధకారులు కూడా పాల్గొన్నారు. గతంలో కుక్కలు, ఏనుగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేశారు. కాని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పులికి కృత్రిమ కాలు అమర్చిన ఘటన మహారాష్ట్ర పశుసంవర్థక శాఖ డాక్టర్ల బృందానికి దక్కింది.