ఇస్రో మరో విజయం ..నింగిలోకి రీశాట్-2బీ

భారత్ అంటే భారతే అనేలా అంతరిక్ష ప్రయోగాల్లో సత్తా చాటుతుంది భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ – ఇస్రో. ఇప్పటికే ఎన్నో విజయాలు తమ ఖాతాలో వేసుకున్న ఇస్రో..తాజాగా బుధువారం మరో విజయాన్ని సాధించి వార్తల్లో నిలిచింది. పీఎస్‌ఎల్‌వీ సీ46 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక ఇవాళ ఉదయం 5.30 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో… 48వ PSLV రాకెట్‌ను వాడినట్లైంది. ఇందుకోసం ప్రత్యేకంగా బూస్టర్లు లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే కోర్‌ అలోన్‌ (PSLV-CA) రాకెట్‌ను ఎంచుకుంది. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇది 14వసారి.

ఇందులో నాలుగు దశలున్నాయి. 1, 3 దశల్లో మోటార్లు ఘన ఇంధనంతో, 2, 4 దశల్లోని మోటార్లు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి. అర్ధరాత్రి ఇంధనం నింపే పని పూర్తి చేశారు. ఆపై ఎలక్ట్రానిక్ వ్యవస్థల్ని పరిశీలించి, ప్రయోగానికి 15 నిమిషాల ముందు రాకెట్‌ను సూపర్‌ కంప్యూటర్‌ అధీనంలోకి తీసుకెళ్లారు.