నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఎక్కడి జనాలు అక్కడే ..

హైదరాబాద్‌ మెట్రోలో లోపాలు మరోసారి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసాయి. సాంకేతిక కారణాల వల్ల బుధవారం ఉదయం నుంచి రాయదుర్గం మార్గంలోని మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మెట్రో ద్వారా ప్రయాణించేందుకు రోజులాగే అమీర్ పేట్ స్టేషన్‌కు ప్రయాణికులు భారీగా రావడంతో అంతా అసౌకర్యానికి గురయ్యారు. వందలాది మంది ప్రయాణికులతో అమీర్ పేట్ స్టేషన్‌ కిక్కిరిసి పోయింది.

అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో తొమ్మిది మెట్రో ట్రైన్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతోనే మెట్రో సేవలకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.