ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు..

నందమూరి తారకరామారావు 23 వర్థంతి సందర్బంగా ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చొరవతో రూ.10కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహంతో పాటు అభివృద్ధి చేసిన తారకరామ సాగర్, ఎన్టీఆర్ గార్డెన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. సత్తెనపల్లికే వన్నె తెచ్చే పనిచేసిన కోడెలను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు సీఎం అన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో కోడెలకు ఎంతో అనుబంధం ఉంది. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి స్థాపనకు నాంది పలికింది ఆయనే. ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే సాటి. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్. పాలన ఎలా ఉండాలో చూపించిన నేత. ఉత్తమ ఉద్యోగిగా, గొప్ప కళాకారుడిగా, పరిపాలనా దక్షకుడిగా ఎన్టీఆర్‌తో ఎవరూ పోటీ పడలేదంటూ తెలిపారు.