జనసేన లోకి వైసీపీ కీలక నేత…

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రోజు రోజుకు తన బలం పెంచుకుంటుంది. తాజాగా వైసీపీకి చెందిన కీలకనేత తన తనయులతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం పార్టీకి మరింత బలం పెంచినట్లు అయ్యింది. కాకినాడ నగరంలో ఎంతో పలుకుబడి, రాజకీయ అనుభవం కలిగి ఉన్న ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయులు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. గౌరవం లేని చోట పనిచేయలేకే పార్టీల నుంచి బయటకు వచ్చానని మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌ వెళ్లినప్పుడు పవన్‌కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు.

అనుకోని పరిణామాల మధ్య ఆయన తనను పార్టీలోకి రావాలని కోరారన్నారు. మీ సేవలు మాకు చాలా అవసరమని, మీ అనుభవం పార్టీకి కావాలని పవన్‌ అడిగే సరికి కాదనలేకపోయానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ లో మంత్రిగా, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా పదవులు చేపట్టిన ముత్తా గోపాలకృష్ణకు కాకినాడ సిటీతోపాటు.. జిల్లాలో వైశ్య సామాజికవర్గంలో బలమైన పట్టుంది. అలాగే ఆయన తనయుడు శశిధర్‌ కూడా క్రియాశీల రాజకీయ నేతగా ఎదిగారు.