పెథాయ్‌ తుపాను ఎఫెక్ట్ : ముగ్గురి మృతి

కాకినాడ – యానాం వద్ద తీరం దాటినా పెథాయ్‌ తుపాను క్రమంగా బలహీన పడుతుంది. తీరం వెంబడి గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రస్తుతం ఒడిశా దిశగా తూఫాన్ పయనిస్తుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తూఫాన్ దాటికి ఇప్పటి వరకు ముగ్గురి మరణించినట్లు తెలుస్తుంది.

ప్రకాశం జిల్లా చీరాలలో నిన్న మధ్యాహ్నం నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో చీరాల మండలంలోని వేటపాలెంలో ముగ్గురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. చీరాల పట్టణంలొని ఐక్యనగర్‌కు చెందిన దుడ్డు వెంకాయమ్మ(73), అదే ప్రాంతానికి చెందిన నూనె కుమారి (60) అనే ఇద్దరు వృద్ధులు మృతిచెందగా.. వేటపాలెంలోని కొత్తకాల్వ సమీపంలొ 60 ఏళ్ల వృద్ధుడు చలితీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు.

తుపాను ప్రభావంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని చోట్ల బస్సులు, రైళ్లు, విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలు, గాలుల తాకిడికి పలుచోట్ల సెల్‌టవర్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.