అస్త్రాలు రెడీ చేస్తోన్న చంద్రబాబు

తెలుగుదేశం ప్రయత్నం ఫలించింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే… కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. అదే రోజు ఆ అవిశ్వాస తీర్మాణం చర్చకు వచ్చే తేది కూడా తెలిసిపోయింది. శుక్రవారమే సభలో అవిశ్వాస తీర్మాణంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అస్త్రాలకు పదనుపెట్టే పనిలో ఉన్నట్టు సమాచారమ్.

ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను సీఎం చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నారు. అవిశ్వాసంపై చర్చకు స్పీకర్‌ ఆమోదం తెలపడంతో చకచకా పావులు కదపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై సమగ్ర సమాచారాన్ని ఎంపీలకు ఇవ్వాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రధాని మోదీ వ్యతిరేకుల మద్దతు కూడగట్టేలా మరింత దూకుడుగా వెళ్లాలని అనుకుంటున్నారు.

అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏ విధంగా మోసం చేసింది? హోదాతో పాటు అపరిష్కృతంగా ఉన్న 18 అంశాలను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చోపచర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఉన్న నేతలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.