కేసీఆర్ సమక్షం లో టీఆర్ఎస్ లో చేరిన దానం..

మాజీ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఈరోజు తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షం లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు దానం నాగేంద్ తన అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేసీఆర్ పనులకు ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టుగా దానం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిన్న ఫిలిం నగర్ లో ప్రెస్ మీట్ ఏర్పటు చేసి తాను కాంగ్రెస్ వీడడానికి దారితీసిన కారణాలను మీడియా ముఖంగా ప్రజలకు , కాంగ్రెస్ కార్య కర్తలకు తెలియజేసారు. ఒకే వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ పార్టీని ఏలుతున్నారని , బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించాను. ఒక సైనికుడిగా పని చేసినప్పటికీ.. చాకిరీగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దానం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలంతా అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఏ మీటింగ్ జరిగినా ఒకే వర్గానికి చెందిన వారు వేదిక మీద ఉంటారు. వారే మాట్లాడుతారు. కానీ బీసీలకు అవకాశం ఇవ్వరు. డి.శ్రీనివాస్‌, కేశవరావు వంటి నాయకులు పార్టీని వీడటానికి కారణాలు ఏమిటి? అని ప్రశ్నించారు. పార్టీలో పొన్నాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారం రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఆత్మగౌరవం లేని చోట ఉండటం సరికాదని పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు.