ఆ అధికారిణి కావాలని పట్టు బట్టి రప్పిస్తున్న జగన్ !

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనపై తనదైన ముద్ర వేస్తున్న వైఎస్ జగన్ ప్రతి నిర్ణయంలో తన పేరు ప్రముఖంగా వినిపించేలా చూస్తున్నారు. గత ప్రభుత్వ 1100 కాల్ సెంటర్ ను స్పందనగా మార్చిన ఆయన, ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమస్య గురించైనా స్పందన ద్వారా అర్జీ పెట్టుకొని పరిష్కారం పొందేలా మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం సమర్థవంతమైన అధికారి కావాలని భావించిన జగన్ కర్ణాటక కేడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిని అమరావతికి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. డిప్యుటేషన్ మీద ఆమెను ఏపీకి పంపాలని కోరుతూ జగన్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ఎస్ అంటే ఆమె జగన్ టీంలో చేరనున్నారు.

ప్రస్తుతం హసన్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న రోహిణి సింధూరి కర్ణాటకలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ఆమె ఓ దశలో మంత్రులకు సైతం చెమటలు పట్టించారు. ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో జన్మించిన దాసరి రోహిణి హైదరాబాద్‌లో పెరిగారు.

ఇంజినీరింగ్ చదివిన ఆమె సివిల్స్ ఎగ్జామ్‌కు నెల రోజుల ముందే రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. మంచం మీదనే ఉండి సాధించారు. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె.. నెల్లూరు జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. సిన్సియర్ అధికారిగా పేరొందిన రోహిణి కర్ణాటకలోని తుమకూరు, మండ్య, హసన్ జిల్లాల్లో పని చేశారు.