తెలంగాణ ప్రజల కోసం మరో మూడు పథకాలు..

తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజల కోసం మరో మూడు పథకాలను తీసుకరాబోతున్నారు. పేదప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు, రైతుకు దన్నుగా ఉండే బీమా, స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థికసహాయం అందించే కార్యక్రమాలను ఆగస్టు 15 నుండి తెలంగాణ సర్కారు చేపడుతున్నది.

ఆ రోజునే అందరికీ సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నదీజలాలను బల్క్‌గా గ్రామాలకు అందించనున్నారు. రైతుకు దన్నుగా ఉండే బీమా పథకం కింద రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో, పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.