కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం..

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో మొదలు కానున్నాయి. ఈ సమావేశాలు అధికార , ప్రతిపక్ష పార్టీలకు చాల కీలకం కాబోతున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సమావేశాలు జరుగుతుండటంతో.. పార్టీలన్నీ చాల సీరియస్‌గా తీసుకున్నారు. అధికార పక్షాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు.. విపక్షాలకు ధీటుగా ఎదుర్కోవాలని అధికారపక్షం అన్ని సిద్ధం చేసుకున్నాయి.

మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశం కూడా హాట్‌, హాట్‌గా జరిగింది. ఈ భేటీలో పార్లమెంట్‌కు సంబంధించిన ఎజెండాపై చర్చించారు. ఈ సెషన్స్‌లో మహిళా రిజర్వేషన్, తలాక్, ఓబీసీ బిల్లులు చర్చకు రానున్నాయి. వీటిని ఆమోదించేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది.

ప్రజా ప్రయోజనమున్న అంశాలపై చర్చిద్దామని అధికార పార్టీ అంటుంటే.. వివాదాస్పద అంశాలు వద్దని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ స్పష్టం చేస్తోంది. వెరసి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానంతోపాటు ఏపీకీ న్యాయం చేయాలనే డిమాండ్‌తో తెలుగుదేశం సన్నద్ధం కాగా, ఉన్నత విద్యా రంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం వివక్ష, రైతులకు గిట్టుబాటు ధరలు వంటి అనేక ఇతర అస్త్రాలతో కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక, ముస్లింలు కేంద్రంగా రాహుల్‌, మోదీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో ప్రతిధ్వనించనున్నాయి. చూద్దాం సమావేశాలు ఎలా జరగబోతాయో.