పెరియార్ డీఎంకేలపై రజనీ సంచలన వ్యాఖ్యలు

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకున్నా సొంతపార్టీ పెట్టకున్నా సంచలన వ్యాఖ్యల ద్వారా నటుడు రజనీకాంత్‌ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. 1971లో పెరియార్‌ నిర్వహించిన మహానాడులో శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి అవమానం జరిగిందని, ఈ ఘటన వల్ల పెరియర్‌ సిద్ధాంతాలను అనుసరించే డీఎంకే రాజకీయంగా వెనుకబడి పోయిందంటూ ఇటీవల రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీన్ని డీఎంకే తీవ్రంగా ఖండించింది.

‘తుగ్లక్‌’ పత్రిక తరఫున ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు రజనీకాంత్‌ తన ప్రసంగంలో ‘మురసొలి పత్రిక చేతిలో ఉంటే అతడు డీఎంకే పార్టీకి చెందిన వాడిగా పరిగణిస్తాం, అదే తుగ్లక్‌ పత్రిక చేతిలో ఉంటే మేధావి అని చెప్పవచ్చు’ అని అన్నారు. అదేవిధంగా ‘ఊరేగింపు సాగుతుండగా సీతారాముల చిత్రపటాలపై డీఎంకే కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీనివల్లనే ఆ పార్టీ బాగా దెబ్బతింది. అప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి ఎంతో చెడ్డపేరు వచ్చింది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్టీ నేతల ఆగ్రహానికి గురిచేశాయి.