ముందస్తుపై సుప్రీంలో పిటిషన్‌

తెలంగాణలో ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సిద్ధిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రంలో గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పిటిషన్ లో పేర్కొన్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20లక్షల మందికి పైగా యువత ఓటుహక్కు పొందేందుకు అవకాశముంటుందని… ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని.. అప్పటివరకు గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు. పిటిషనర్ అభిప్రాయంతో సుప్రీం ఏకభవిస్తే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.