కేంద్రం మాట వినకుంటే ఇబ్బందులు తప్పవు….జగన్ సర్కార్ కి హెచ్చరిక !

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో (పీపీఏ) అవకతవకలు జరిగాయని జగన్ సర్కారు బలంగా భావిస్తోంది. దీంతో ఈ పీపీఏలను పునః సమీక్షించాలని నిర్ణయించింది. ఇందుకోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పీపీఏలను సమీక్షిస్తే.. దాని ప్రభావం పెట్టుబడులపై ఉంటుందని కేంద్రం హెచ్చరిస్తోన్నా జగన్ సర్కారు మాత్రం వాటిని సమీక్షించి తీరుతామని చెబుతోంది.

కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ జగన్‌కు లేఖ రాసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘ఫిచ్’ ఆందోళన వ్యక్తం చేసింది. సోలార్, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ప్రభుత్వ చర్యలు విద్యుదుత్పత్తి కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఫిచ్ హెచ్చరించింది.

ప్రభుత్వ ప్రయత్నాలతో ఉత్పత్తి సంస్థల నగదు ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయని వివరించింది. పునరుత్పాదక విద్యుత్ సంస్థలు, కేంద్రం నుంచి ప్రభుత్వం సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫిచ్ హెచ్చరించింది. ప్రభుత్వం పీపీఏలపై పునఃసమీక్షలు నిర్వహించే ప్రయత్నం చేసినా విద్యుత్ సంస్థలకు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. మరి జగన్ ఈ సంస్థ మాట అయినా చెవికి ఎక్కించుకుంటారా ? అనేది ఆసక్తికరంగా మారింది.