రెండో విడతకు సర్కార్ సిద్ధం..

వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 4000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 8000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతకు గాను ఎకరాకు 4000 రూపాయిలు చొప్పున ఇచ్చిన తెలంగాణ సర్కార్..రెండో విడత ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.

రెండో విడత సాయాన్ని రబీ సీజన్‌కు ముందే అందించేటందుకు సిద్ధమైంది. అవసరమైన రూ.5925 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే వీటిని కార్డుల రూపంలో ఇవ్వాలా? లేదా చెక్కుల రూపంలో ఇవ్వాలా? అనే విషయం ఇంకా ఖరారు కాలేదు. యాసంగి(రబీ) సీజన్ అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. అందుకని సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం ప్రారంభంలో పంట సాగు చేసిన భూములకు మాత్రమే రెండో విడతలో పెట్టుబడి సాయం అందిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఖరీఫ్‌లో ఇచ్చిన రైతులందరికీ పంట సాగు చేసినా.. చేయకపోయినా పెట్టుబడి సాయం అందనుంది.