ఇలాంటి పోలీసుల వల్ల చెడ్డ పేరు వస్తుందంటూ కేటీఆర్ ఫైర్

లాక్ డౌన్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. అలాగే పోలీసులు సైతం రోడ్ల ఫై ఎవరైనా కనిపిస్తే వారి లాఠీకి పనిచెపుతున్నారు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పోలీసులు అలా ప్రవర్తించడంలో తప్పు లేదు. అయితే, కొందరు పోలీసులు విచక్షణ కోల్పోయి, ఓవరాక్షన్ చేస్తున్నారు. కారణం లేకుండానే కొడుతున్నారు. ఇప్పటికే పలు ఘటనలు సోషల్ మీడియా లో వైరల్ గా కాగా తాజాగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా వ‌న‌ప‌ర్తిలో న‌డిరోడ్డుపై ఓ వ్య‌క్తిని పోలీసులు చిటిక బాదిన ఘటన సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని అతడి కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు పోలీసులు. తన తండ్రిని ఏమీ చేయ వ‌ద్దంటూ ఆ పిల్లాడు ఏడుస్తూ పోలీసుల్ని వేడుకున్నా… ఆ పోలీసుల హృద‌యాలు క‌ర‌గ‌లేదు. గొడ్డును బాదిన‌ట్టు న‌డిరోడ్డుపై అమానుషంగా ప్రవర్తించారు. ‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’ అంటూ ఒకవైపు తండ్రిని, మరోవైపు తండ్రిపైకి దూకుతున్న పోలీసులను పిల్లాడు బ‌తిమ‌లాడుతూ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు.

దీనిని చిత్రీకరించిన ఓ వ్యక్తి దానిని కేటీఆర్ మొదలగు వారికీ ట్వీట్ చేయగా..దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సదరు పోలీసుల అమాన‌వీయ ప్ర‌వ‌ర్త‌న‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. హోమ్‌ మినిష్టర్‌ మహమూద్‌ అలీ, తెలంగాణ డీజీపీలు దయజేసి ఇలాంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోండి. కొద్దిమంది పోలీసుల తిక్క చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోంద’ని త‌న ఆవేద‌న‌, ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కాడు. స‌ద‌రు పోలీసుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.