పరుగు పందెం లో అపశ్రుతి

తెలంగాణ లో పోలీసు ఫిజికల్ పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని సిటీ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లో నిర్వహించిన పరుగు పందెంలో యువతి ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబ సభ్యులను శోక సంద్రంలో నింపింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిశాల గ్రామానికి చెందిన వి. మమత(20) సోమవారం పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైంది. దీనిలో భాగంగా అభ్యర్థులకు 100మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పందెంలో ఉత్సాహంగా పాల్గొన్న మమత కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. అక్కడే అందుబాటులో ఉన్న డాక్టర్లు ఆమెకు ప్రాథమిక చికిత్స అందజేసి అనంతరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మెరుగైన చికిత్స అందించినా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషాదకరమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలహాసన్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు అనారోగ్యంతో ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని వారికి తర్వాతి రోజు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబీకులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అదుకుంటామని ప్రకటించారు.