నేటి నుండే తెలంగాణ శాసనసభ సమావేశాలు..

తెలంగాణ శాసన సభ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కాబోతున్నాయి. శాసన సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడం తో రాష్ట్ర ప్రజలంతా ఈ సమావేశాల ఫై ఆసక్తి కనపరుస్తున్నారు. మొత్తం నాల్గు రోజుల పాటూ ఈ సమావేశాలు జరగనున్నాయి.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం బుధవారం రాజ్‌భవన్‌లో సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతుంది. అంతకుముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచే అసెంబ్లీకి తరలివెళ్తారు. 11.05 గంటల నుంచి అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాణం చేస్తారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం జరుగుతుంది. దాదాపు రెండు గంటలపాటు సభ్యుల ప్రమాణస్వీకారాలు ఉంటాయని తెలుస్తుంది. 18న స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. శాసనసభ, మండలి బీఏసీల సమావేశాలు కూడా జరుగుతాయి. 19న ఉభయసభల సమావేశంలో గవర్నర్‌ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు.