తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు…పెంచిన పెన్షన్లు 20నుంచి అమలు …!

తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఐదు గంటలపాటు మారథన్ భేటి జరిపిన కేసీఆర్ అండ్ టీం పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. కేబినెట్ మునిసిపల్‌ వార్డుల సంఖ్య సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు, వైద్య అధ్యాపకుల వయోపరిమితి పెంపు బిల్లు, సమగ్ర టౌన్‌షిప్ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో ఈ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

ఇక మునిసిపల్‌ ఎన్నికల తరుణంలో కీలక నిర్ణయాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెంచిన పెన్షన్లు 20న పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి గ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్‌ను 2019 జూన్ నుంచే అమలు చేయనున్నారు. జూన్‌కు సంబంధించిన పెన్షన్‌ను జూలైలో లబ్ధిదారులకు అందజేస్తారు.