మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు..

న్యూ ఇయర్ సందర్భాంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తెగ జోరుగా సాగాయి. కేవలం డిసెంబర్ 30 , 31 రోజుల్లోనే దాదాపు 400 కోట్ల రూపాయ‌లు మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. మ‌ద్యం విషయంలో ఎలాంటి ష‌ర‌తులు లేని క‌ర్ణాట‌క‌లో, బెంగ‌ళూరు వంటి మ‌హా న‌గ‌రాన్ని క‌లుపుకుంటే.. ప‌ది రోజుల్లో ఐదువంద‌ల కోట్ల రూపాయ‌ల స్థాయిలో మ‌ద్యం అమ్ముడు అయితే, తెలంగాణ‌లో మాత్రం రెండు రోజుల్లో నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల అమ్మకాలు జరిపి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌తి రోజూ క‌నీసం అర‌వై కోట్ల రూపాయ‌ల స్థాయిలో మ‌ద్యం సేల్ అవుతుంద‌ని అంచ‌నా. అది రోజూ జ‌రిగే స‌గ‌టు వ్యాపారం విలువ‌. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా మాత్రం అది అనేక రెట్లు పెరిగింది. రోజుకు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల స్థాయికి చేరింది. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం మందు బాబులు ఏ రేంజ్ లో ఉన్నారో..