తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరాలు జల్లు..

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తుండడం తో ప్రజలకు కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. దీనికి సంబందించిన పాక్షిక మేనిఫెస్టోను మంగళవారం (అక్టోబర్ 16) విడుదల చేసారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు, రెడ్డి, వైశ్య కులాలకు కార్పొరేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైతులకు మరోసారి లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించారు. రైతు బంధు కింద ఏడాదికి ఎకరానికి రూ. 10 వేలు అందించనున్నట్లు తెలిపారు. ఆసరా, వికలాంగుల ఫించన్లు తదితరాలను రెట్టింపు చేశారు. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ. 3016 భృతి ప్రకటించారు.

మేనిఫెస్టో ప్రధాన అంశాలు:

* రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధివిధానాలు, నిర్ణయం.
ఆసరా పింఛన్లు రూ. 1000 నుంచి రూ. 2016కు పెంపు.

* వికలాంగుల పింఛన్ రూ. 1500 నుంచి రూ. 3016కు పెంపు.
* పింఛన్ల వయోపరిమితి 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్లకు కుదింపు. తద్వారా అదనంగా 8 లక్షల మందికి ప్రయోజనం.

* నిరుద్యోగులకు నెలకు రూ. 3016 భృతి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హతలు, నిబంధనలు, విధి విధానాల రూపకల్పన. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా అమలు.

* రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ. కిందటిసారిలా కాకుండా ఒకే దఫాలో మాఫీ చేయనున్నట్లు ప్రకటించిన సీఎం. దీని ద్వారా రాష్ట్రంలో 45.5 లక్షల రైతులకు లబ్ధి. లక్ష అంతకంటే తక్కువ రుణాలు ఉన్న 42 లక్షల మందికి పూర్తిగా, లక్షకు పైగా రుణాలు ఉన్న మరో 3.5 లక్షల మందికి లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ అవుతాయి.

* రైతు బంధు కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరానికి రూ. 10 వేలకు పెంపు. ప్రస్తుతం రూ. 8 వేలు అందిస్తుండగా.. మరో రూ. 2000 పెంపు.

* రెండు నియోజకవర్గాలకు కలిపి ఒకటి నుంచి రెండు వరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. ఐకేపీ సభ్యులకు వీటిలో ఉపాధి. రూ. 2 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్.

* నిరుపేదల కోసం 2 లక్షల 60 వేల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం.

* సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టుకోవాలని కోరుకుంటున్నవారికి అవకాశం. కొంత సాయంతో ఇళ్లు నిర్మించుకునేలా మరికొన్ని వర్గాలకూ సాయం.

* ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక కార్యక్రమాలు. యాదవుల కోసం ప్రవేశపెట్టిన పథకాల మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు. రూ. 10 నుంచి 15 కోట్లతో ఎస్సీలకు, రూ. 16 కోట్లతో గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు.
అగ్ర కులాల పేదలకు ప్రత్యేక కార్యక్రమాలు.

* రెడ్డి, వైశ్య కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధివిధానాలు వంటివి మేనిఫెస్టో లో ప్రకటించారు.

కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రకటనపై రాష్ట్ర ప్రజలంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పింఛనును రెట్టింపు చేయడంతో లబ్ధిదారుల ఆనందం తో ఉబ్బితబ్బి అవుతున్నారు.