శాసనమండలి రద్దు.. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం


శాసన మండలి రద్దుపై చర్చించడం కోసం ఏపీ కేబినెట్ సోమవారం ఉదయం భేటీ అయ్యింది. సచివాలయం బ్లాక్‌-1లో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాసేపట్లో కేబినెట్ తీర్మానాన్ని మంత్రి బుగ్గన శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

గత సోమవారమే ఏపీ కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆరోజు ఆమోదం తెలిపింది. శాసన సభలో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందగా.. శాసన మండలిలో మాత్రం భిన్నమైన ఫలితం వచ్చింది. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు.

శాసన మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరుపట్ల, చైర్మన్ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి మండలి మనకు అవసరమా అనేది ఆలోచించాలన్నారు. ఇప్పుడు శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్నారు.