రివ్యూ : భైర‌వగీత – ఫ్యాక్షన్ లవ్ స్టోరీ

స్టార్ కాస్ట్ : ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ తదితరులు..
దర్శకత్వం : సిద్ధార్థ్ తాతోలు
నిర్మాతలు: అభిషేక్ పిక్చ‌ర్స్
మ్యూజిక్ : రవి శంకర్
విడుదల తేది :డిసెంబర్ 14, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

రివ్యూ : భైర‌వగీత – ఫ్యాక్షన్ లవ్ స్టోరీ

ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీ గా తెరకెక్కిన చిత్రం భైరవగీత. 23 ఏళ్ల కొత్త ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ తాతోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా మ‌రియు భాస్క‌ర్ రిషి ఈ చిత్రాన్ని నిర్మించగా , రామ్ గోపాల్ వర్మ స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో వర్మ చేయి పెట్టడం తో ఈ సినిమా కు మంచి క్రేజ్ వచ్చింది.

ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ రావడం.. అన్ని వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌న రావడం తో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసారు. ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల ముందే హైదరాబాద్ లో ప్రీమియర్ షోస్ వేయగా వాటికీ పాజిటివ్ స్పందన వచ్చింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంత మేరకు నచ్చింది..? ఈ కథ ఏంటి..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

భైరవ (ధనుంజయ) తన ఊరిలో అగ్రవర్ణానికి చెందిన సుబ్బారెడ్డి (బాలరాజ్‌వాడీ) దగ్గర పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి ప్రాణాలను కాపాడటం కోసం కత్తి పట్టి నిలబడతాడు భైరవ. అదే ఊరిలో సుబ్బారెడ్డికి కేశవరెడ్డి (భాస్కర్ మన్యం)తో ఫ్యాక్షన్ గొడవలు జరుగుతుంటాయి. కేశవరెడ్డి నుండి సుబ్బారెడ్డి కాపాడడం కోసం భైరవ తన ప్రాణాలను అడ్డు పెడుతుంటాడు.

ఈ నేపథ్యంలో కేశవరెడ్డితో వియ్యం అందుకుంటే తనకు ఊరిలో ఎదురే ఉండదని పట్నంలో చదువుకుంటున్న తన కూతురు గీత (ఇర్రా మోర్)ని కేశవరెడ్డి కొడుకు కట్టారెడ్డి (విజయ్)కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు సుబ్బారెడ్డి. కానీ కట్టారెడ్డి ని పెళ్లి చేసుకోవడం గీత కు ఇష్టం ఉండదు. ఒక టైం లో తనను కాపాడిన భైరవ ను గీత ఇష్ట పడుతుంది. గీత అంటే భైరవ సైతం ఇష్టమే. కానీ అగ్ర కులాలలు కావడం తో తన ప్రేమను చెప్పలేకపోతాడు.

ఇక భైరవ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది గీత. ఈ విషయం తండ్రి సుబ్బారెడ్డికి తెలియడం తో భైరవని చంపాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని భైరవతో చెప్పే ప్రయత్నంలో గీత తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆ తర్వాత ఆ ఊరి నుండి పారిపోతారు ‘భైరవగీత’ జంట. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? భైరవగీత పెళ్లి చేసుకుంటారా లేదా..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ నటన

* సినిమాటోగ్రఫీ

* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ :

* రొటీన్ స్క్రీన్ ప్లే

* యాక్షన్ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ధనుంజయ, ఇర్రా మోర్‌లు పరిణితి ఉన్న నటనతో చక్కగా మెప్పించారు. ముఖ్యంగా భైరవ పాత్రలో ధనుంజయ ఒదిగిపోయాడు. తన ప్రేమకోసం బలైపోయిన తల్లిని చూసి ఏడ్చే సన్నివేశం.. థియేటర్‌లో ప్రేక్షకుల కళ్లు చెమర్చేలా అద్భుతంగా నటించాడు.

* ఇండస్ట్రీకి పరిచయమైన ఇర్రా మోర్‌కి ‘భైరవగీత’ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఈ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగడం తో గీత పాత్రలో పరిణితి ఉన్న నటనతో ఆకట్టుకుంది. ఇక గ్లామర్ పరంగానూ కనువిందు చేసింది. లిప్ లాక్ లు, నాభిసోయగాలు, నడువొంపులతో యూత్ ను బాగా ఆకట్టుకుంది.

* ప్రతినాయకుడిగా నటించిన కొత్త నటుడు కట్టారెడ్డి (విజయ్). ఆరున్నర అడుగులు.. భారీ శరీరంతో ఉన్న విజయ్ విలన్‌గా అదరగొట్టాడు. దర్శకులకు తెలుగులో మరో ప్రతినాయకుడు దొరికినట్టే.

* మిగతా పాత్రలో నటించిన వారంతా వారి పాత్రలకు తగ్గట్లే బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* చిత్రానికి మ్యూజిక్ అందించిన ర‌వి శంక‌ర్ మంచి మార్కులు వేసుకున్నాడు. ఫ్యాక్షన్ కథ కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇవ్వాలో , రొమాంటిక్ సన్నివేశాల్లో ఎలా ఇవ్వాలో ఆలా ఇచ్చి ఆకట్టుకున్నాడు. వందేమాతరం, ఇదో ఇది సాంగ్‌లతో పాటు హీరో తల్లి చనిపోయినప్పుడు వచ్చే సాంగ్ కథను అనుగుణంగా కథలో భాగంగా ఉన్నాయి.

* రామ్ వంశీ క్రిష్ణ అందించిన మాటలు కూడా ఆకట్టుకున్నాయి.

* రాయలసీమ ఫ్యాక్షన్‌ను విజువల్‌గా ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో చక్కగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి. రాయల సీమ నేటివిటీ ప్రతిబంబించేలే కడప, బాదామీ ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లను కెమెరాలో బంధించగలిగారు. ప్రతి ఫ్రేమ్ చాలా రియలిస్టిక్‌గా చూపించగలిగారు.

* నిర్మాతలు అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.

* ఇక డైరెక్టర్ సిద్ధార్థ్ తాతోలు విషయానికి వస్తే 23 ఏళ్ల ఈ కుర్రాడు ..వర్మ శిష్యుడి గా మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేసుకున్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కథను డీల్ చేయడం లో అదరగొట్టాడు. ఫస్టాఫ్ మొత్తం ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ ఎక్కడా బోర్ కొట్టకుండా మెల్లగా కథలోకి తీసుకువెళ్లి.. సెకండాఫ్‌ మొత్తం బానిస బతుకుల విముక్తి కోసం హీరో చేసిన తిరుగుబాటుని ఆసక్తికరంగా తెరకెక్కించారు. కాకపోతే కథ విషయంలోనే కొత్తగా ఆలోచించలేదు. ఇప్పటివరకు చాల సినిమాల్లో చూసిన కథనే మళ్లీ చూపించాడు. ఓవరాల్ గా యాక్షన్ ప్రియులకు ఈ సినిమా నచ్చవచ్చు.