రివ్యూ : ‘చి ల సౌ’ – అందరూ మెచ్చే సినిమా

స్టార్ కాస్ట్ : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు..
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్ విహారి
విడుదల తేది : ఆగస్టు 03, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

సుశాంత్ , రుహాని శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘చి ల సౌ’ . ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటివరకు తెర ఫై హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన రాహుల్ , ఈ సినిమాతో మొదటిసారిగా డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చిత్ర టీజర్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకోవడం , మ్యూజిక్ కూడా బాగుండడం తో ఈ సినిమా అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే భావన అందరిలో పెరగడం తో రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. మరి ఈ ‘చి.ల.సౌ’ కథ ఏంటి..? రాహుల్ డైరెక్టర్ గా సక్సెస్ సాదించాడా..? ఈ మూవీ ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుశాంత్ కు ఈ మూవీ ఎంతగా కలిసొచ్చింది..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్‌(సుశాంత్‌) 27 ఏళ్ల యువకుడి..పెళ్లి ఈడూకొచ్చిన కానీ పెళ్లి ఫై మాత్రం ఇష్టం ఉండదు..ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటూ త‌ల్లిదండ్రులు(అను హాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్‌) వెంటపడుతారు. కానీ అర్జున్ మాత్రం మరో ఐదేళ్లు అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెపుతుంటాడు. కానీ తల్లిదండ్రులు పోరు భరించలేక ఓ పెళ్లి చూపులకు సిద్ధం అవుతాడు. ఇంట్లోనే ఎవ‌రూ లేకుండా కేవ‌లం అర్జున్ మాత్రమే ఉండేలా అంజ‌లి(రుహానీ శ‌ర్మ‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది.

పెళ్లి చూపులు ఏమాత్రం ఇష్టం లేనప్పటికీ ఏదో ఆలా అంజలి చూసేందుకు సిద్ధం అవుతాడు. కానీ అంజలి మాటలు , ఆమె ప్రవర్తన నచ్చి తనకు తెలియకుండానే ఆమెతో ఓ క‌నెక్ష‌న్ ఏర్ప‌డుతుంది. దాంతో ఆమె అంటే ఇష్టం ఏర్ప‌డుతుంది. అదే స‌మ‌యంలో అంజ‌లి త‌ల్లి(రోహిణి)కి ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో అర్జునే ఆమెకు స‌హాయంగా నిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోను అనే అర్జున్ , అంజలి ని పెళ్లి చేసుకున్నాడా..? లేదా..? అసలు అర్జున్ ఎందుకు ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోను అని ఎందుకు కూర్చున్నాడు..? అసలు అర్జున్ లైఫ్ లో ఏం జరిగింది..అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* కథ – కథనం

* సుశాంత్ – రుహానీ యాక్టింగ్

* మ్యూజిక్

* కామెడీ

మైనస్ :

* అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* హీరోగా సుశాంత్‌కు ఈ చిత్రం ఓ మైలు రాయి చిత్రం అనే చెప్పాలి. అసలు సుశాంత్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవరు కూడా ఊహించలేరు. చాలా ఏళ్ల తరువాత సుశాంత్‌లోని నటుడ్ని బయటకు తీసుకువచ్చాడు దర్శకుడు. లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్‌ను బాగానే పండించ గలిగాడు. ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రంతో సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌ు.

* ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రుహాని..కథలో ఎమోషనల్ జర్నీ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. ఆమెకు తొలి చిత్రమే అయినప్పటికీ ఎన్నో చిత్రాల అనుభవం ఉన్న హీరోయిన్ గా చాల అద్భుతంగా నటించింది. అంజలి పాత్రలో చాలా అందంగా కనిపించింది. ఆమె పాత్రకు చిన్మ‌యి డ‌బ్బింగ్ బాగా కలిసొచ్చింది. అలాగే సినిమా మొత్తం ఒకే డ్రెస్‌లో కనిపించి పాత్రలో ఒదిగిపోయి నటించింది.

మేకప్ లేకుండా పింపుల్స్‌తో నటించి పాత్రకు రియాలిటీని తెచ్చింది. అంజలి పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. కొన్ని సీన్లలో హీరోని డామినేట్ చేసిందంటే నమ్మలేరు.

* హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి, హీరో తల్లి పాత్రలో అను హాసన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు మరింత హెల్ప్ అయ్యింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో ఫుల్ కామెడీ ని అందించాడు.

* మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న కాసేపైనా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ చెల్లిగా నటించిన విద్యుల్లేఖ రామన్‌ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగతా వారంతా వారి వారి పాత్రల్లో నాయ్యం చేసారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా సినిమాటోగ్రాఫర్ సుకుమార్‌ పనితనం సినిమాకు హైలైట్ గా ఉంది.

* ప్రశాంత్ ఆర్ విహారి అందించిన పాటలు సందర్భానుసారంగా వచ్చి ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

* చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ లో ఇంకొచ్చాం కత్తెర పడితే బాగుండు.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ రాహుల్ విషయానికి వస్తే మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ గా సినిమాను తెరకెక్కించి ఫుల్ మార్కులు కొట్టేసాడు. పెళ్లి అనే సింపుల్‌ లైన్‌ను తీసుకుని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ కథను ఎంతో అందంగా మలిచాడు రాహుల్ రవీంద్రన్.

డైరెక్టర్ గా మొదటి చిత్రమే అయినా కన్ఫ్యూజన్ లేకుండా లాజిక్‌లు, మ్యాజిక్‌ల జోలికి పోకుండా సున్నితమైన భావోద్వేగాలతో రియలిస్టిక్ ప్రేమకథను అందించి సక్సెస్ అయ్యాడు. హీరో హీరోయిన్ల మధ్య ఒక రాత్రిలో జరిగే పెళ్లి చూపుల్ని కథాంశంగా తీయడం అనేది ఓ ప్రయోగమే అని చెప్పాలి. అందమైన లొకేషన్లు, భారీ యాక్షన్ సీన్లు లాంటి హంగామా లేకుండా కేవలం పాత్రల ద్వారా కథను నడిపించారు. ఆయనకు నటుడుగా కంటే దర్శకుడిగానే ఎక్కువ మార్కులు కొట్టేసాడు. తొలి సినిమాతోనే తనలోని దర్శకుడితో పాటు రచయితకు కూడా తన సత్తాను చాటుకున్నాడు.

చివరిగా :

ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్‌గా సాగుతూ మంచి ఇంట్రెస్టింగ్ నోట్‌లో సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకోవడం, అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు అనిపించినా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ త‌ర్వాత క‌థ మళ్లీ పుంజుకుంటుంది. ఇక క్లైమాక్స్ వరకూ కథలో అక్కడక్కడా లాజిక్ మిస్ అయ్యే సీన్లు ఉన్నప్పటికీ ఎమోషనల్ లవ్ జర్నీలో కవర్ అయిపోయాయి. హీరో ఐదేళ్ల వరకు పెళ్లి వ‌ద్దునుకోవ‌డం.. చివ‌ర‌కు కావాల‌నుకోవ‌డం.. హీరోయిన్ ముందుగా పెళ్లి చేసుకోకూడ‌ద‌ని అనుకున్నా.. తల్లి కోసం పెళ్లి చూపులు చూడ‌టం.. హీరో.. హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. ఇలా అన్ని కూడా సినిమాను ఓ స్థాయి కి తీసుకెళ్లి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించాయి. ఓవరాల్ గా ఈ ‘చి ల సౌ’ అందరూ మెచ్చే ఫ్యామిలీ మూవీ.