రివ్యూ : దొరసాని (ప్రేమ ఏమైనా చేయిస్తుంది)

రివ్యూ : దొరసాని  (ప్రేమ ఏమైనా చేయిస్తుంది)
స్టార్ కాస్ట్ :  ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, వినయ్ వర్మ తదితరులు
సంగీతం :  ప్రశాంత్ ఆర్ విహారి
దర్శకత్వం : కేవీ మహేంద్ర
నిర్మాత : యష్ రంగినేని, మధుర శ్రీధర్
విడుదల తేది : జులై 12 2019

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ శేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతోన్న సినిమా దొరసాని. కేవీఆర్ మహేంద్ర అనే నూత దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ సినిమాని మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఆనంద్ విజయ్ దేవరకొండ తమ్ముడు కావడం, శివాత్మిక.. జీవిత, రాజశేఖర్ల కుమార్తె కావడంతో అందరి దృష్టి ఈ సినిమా మీదనే ఉంది. ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచింది. మరి ఈ సినిమా ఆ మేరకు అంచనాలు అందుకుందా ? లేదా అనేది చూద్దాం.

కధ :

కధ 1980ల కాలంలో జరుగుతుంది. గడీలో ఉండే ఊరి పెద్ద దొర రాజు(సూత్రధారి వినయ్ వర్మ). ఊరు మొత్తం దొర కాళ్ళ కింద ఆయన కనుసైగలకు అనుగుణంగా బతుకుతూ ఉంటుంది. దొర తన చిన్నకూతురయిన  దొరసాని(దేవకి)(శివాత్మిక రాజశేఖర్)ని ఎవ్వరికి కనిపించకుండా పెంచుతాడు. కానీ ఆమెను ఒకానొక సందర్భంలో చూసిన ఆ ఊరిలో కూలీ కొడుకైన రాజు (ఆనంద్ దేవరకొండ) ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. దొరసాని కూడా రాజుని ప్రేమిస్తుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం దొరకి తెలుస్తుంది. ఒక కూలివాడి కొడుకు దొరసానిని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేని అతను రాజు తల్లిదండ్రులను బందించి నరకం చూపిస్తాడు. రాజుని చేయని నేరంలో ఇరికించి పోలీసులకు పట్టించి చెరసాలలో బందిస్తాడు. రాజుని మర్చిపోవాలని కూతురు దేవకికి కూడా వార్నింగ్ ఇస్తాడు. మరి దేవకి రాజును మర్చిపోయిందా ? జైలుకు వెళ్ళిన రాజు ఏమయ్యాడు ? మళ్ళీ వాళ్ళిద్దరూ కలిశారా ? వారి ప్రేమ కథ ఎలా ముగిసింది ? అనేదే సినిమా కథ.

ప్లస్‌ పాయింట్స్‌:

* సంగీతం
* శివాత్మిక నటన
* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్‌ పాయింట్స్‌:

* స్లో నేరేషన్
* చూసిన సినిమానే మళ్లీ చూస్తున్నట్లు వచ్చే ఫీల్
* ఉత్కంట లేని స్క్రీన్ ప్ల
* కధనం

న‌టీన‌టుల పెర్పామెన్స్ : ఈ సినిమాకి మొదటి విజయం క్యాస్టింగ్ ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇక వినయ్ వర్మతో పాటుగా సినిమాలో మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం :

ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఇక ఆయన ఆర్ఆర్ లేకుండా సినిమా ఫీల్ రాదేమో అన్నంతగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇక సన్ని కుర్రపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్ ప్లాయింట్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది.

నిజానికి మన తెలుగు సినిమాల్లో 80 శాతం సినిమాలు ప్రేమకథలే, అలా అన్ని వచ్చినా మనసుకి హత్తుకునేవీ మాత్రం కొన్నే. ఈ సినిమా కూడా అదే కోవకు చెందింది. కొత్త దర్శకుడు మహేంద్ర కొత్త దర్శకుడిని అనే విషయం ఎక్కడా కనపడకుండా అద్భుతమైన కథ, కథనాలతో దొరసాని ఆకట్టుకుంది. 80ల నాటి పరిస్థితులకు తగినట్టుగా కథ రాసుకున్న దర్శకుడు కథనం కూడా అలాగే నడిపించాడు. కథ రొటీన్ అయినా కథనం బాగా రాసుకున్నాడు దర్శకుడు. మొత్తానికి ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5