రివ్యూ: గద్దలకొండ గణేష్– సినిమా చూపించాడు

సినిమా టైటిల్ : గద్దలకొండ గణేష్
తారాగణం: వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్డే, మృలాలీని రవి తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
దర్శకత్వం: హరీష్ శంకర్
విడుదల తేదీ: 20-09-2019

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రీమేక్ సినిమా తీసి హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. రీమేక్ సినిమాలో వుండే ప్రధాన సౌలభ్యం కధ. ఆల్రెడీ హిట్ అయిన కధనే తీస్తారు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. కానీ ఆ కథ ఎందుకు హిట్ ఐయింది.? ఆ కథలో వుండే ఎమోషన్ ఏమిటి ? ఆ సినిమాని ప్రేక్షకులను ఎందుకు విజయం చేశారు? అనే పాయింట్ పట్టుకోవాలి. ఈ పాయింట్ గబ్బర్ సింగ్ తో బాగానే క్యాచ్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన నుండి మరో రీమేక్ వచ్చింది. అదే వాల్మీకి. చివరి నిమిషంలో ‘గద్దల కొండ గణేష్’ గా పేరు మార్చారు. ‘ఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం.

కథ : తమిళ్ జిగర్తాండ కి రీమేక్ ఇది. కథ లైన్ లో పెద్ద మార్పులు కనిపించలేదు. ఆ లైన్ ని టూకీగా చెప్పుకుంటే .. అభిలాష్ (అధర్వ) దర్శకుడు కావాలని కలలుకంటాడు. ఒక గ్యాంగ్ స్టార్ పై సినిమా తీయాలని కథ వేటలో పడతాడు. గద్దలకొండ గణేష్( వరుణ్ తేజ్ ) ఓ గ్యాంగ్ స్టార్. అతని జీవితాన్ని అతనికి తెలియకుండా సీక్రెట్ గా ఫాలో అవుతుంటాడు. ఈ క్రమంలో అభిలాష్ గురించి తెలుసుకున్న గద్దలకొండ గణేష్,.. తానే హీరోగా సినిమా తీయాలని పట్టుబడతాడు. తర్వాత ఏమైయిందనేదే మిగిలిన కథ.

ఎలా వుంది: హరీష్ శంకర్.. దర్శకుడిగా కంటే మాంఛి రైటర్. స్వతహాగా కథని రాసుకోగలడు. ఐతే రీమేకులకు వ్యతిరేకం కాదు. ఓ హిట్ సినిమాని ఇంకా హిట్ చేయడం ఎలా అన్నది గబ్బర్ సింగ్ తో చూపించాడు. అందుకే హరీష్ నుండి వచ్చిన గద్దలకొండ గణేష్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలు అందుకోవడం చాలా వరకూ సక్సెస్ కూడా అయ్యాడు హరీష్.

సినిమా తొలిసగం తమిళ్ జిగర్తాండ నుండి ఎలాంటి మార్పులు లేకుండా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్నీ కథని సులువుగా ముందుకు తీసుకెళ్తాయి. ఎక్కడా పెద్ద తడబాటు కనిపించదు. హరీష్ శంకర్ బలం వినోదం. ఆ వినోదం మరోసారి వర్క్ అవుట్ అయ్యింది. తమిళ కామెడీ సీన్స్ తీసుకున్నప్పటికీ తనదైన ట్రీట్ మెంట్ తో నవ్వించగలిగాడు హరీష్.

ఐతే జిగర్తాండ రెండో సగంలో అద్భుతమైన సన్నివేశాలు, కామెడీ టైమింగ్ ఉంటుంది. కానీ ‘గద్దల కొండ గణేష్’ విషయానికి వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై ఎక్కువ ద్రుష్టి పెట్టారు. దింతో ఫ్లోకి ఇబ్బందిగా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వరుణ్ తేజ్, పూజాలు చూడ్డానికి బావున్నా.. మరీ పాత కథలానే ఉండటంతో కొంచెం లాగ్ ఐయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఐతే క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ ‘గద్దల కొండ గణేష్’ గాడిలో పడతాడు. చివర్లో వచ్చే సెంటిమెంట్ సీన్లు ఓకే అనిపిస్తాయి. అలాగే సినిమా మేకింగ్ పై ఇచ్చే మెసేజ్ కూడా బావుంటుంది. అన్నట్టు సినిమా చివర్లో వచ్చే కామియో రోల్స్ పై హరీష్ వేసిన సెటైర్లు నవ్విస్తాయి. టోటల్ గా సినిమా పాజిటివ్ నోట్ తో పూర్తవుతుంది.

ఎవరెలా చేశారు:

వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఈ సినిమా మెయిన్ పిల్లర్. దాదాపు సినిమా అంతా ఆ పాత్ర చుట్టే తిరుగుతుంది. ‘గద్దల కొండ గణేష్’ గా వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ అదిరిపోయింది. ఎఫ్ 2 తర్వాత వరుణ్ మంచి వైవిధ్యం చూపించాడు. మొదటి నుండి వరుణ్ తేజ్ కి మంచి నటుడిగా గుర్తింపు వుంది. ఇందులో మరోసారి తన నటన చూపించే అవకాశం దక్కింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ మెప్పిస్తాయి. మరో ముఖ్యమైన పాత్ర చేసిన అధర్వ కూడ మెప్పిస్తాడు. మృలాలీని రవి నటన ఓకే. పూజా హెగ్డే ఫ్లాష్ బ్యాక్ కె పరిమితమౌతుంది. వెల్లువచ్చే గోదారమ్మ పాట తప్పితే ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు . బ్రహ్మజీ, సత్యల కామెడీ అలరిస్తుంది.

సాంకేతికంగా సినిమా ఉన్నంతగా వుంటుంది. మిక్కీ జె మేయర్ అందించిన నేపధ్య సంగీతం బావుంది. పాటల చిత్రీకరణ కూడా బాగ కుదిరింది. రెండు పాటలు విజువల్ గా బావున్నాయి. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.