రివ్యూ : జార్జ్ రెడ్డి – ఈ తరం యువత చూడాల్సిన కథ

స్టార్ కాస్ట్ : సందీప్ మాధవ్, ముస్కాన్, సత్యదేవ్ తదితరులు..
దర్శకత్వం : జీవన్ రెడ్డి
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అప్పి రెడ్డి, దామురెడ్డి, సుధాకర్ రెడ్డి యెక్కంటి
మ్యూజిక్ : సురేష్
విడుదల తేది : నవంబర్ 22, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : జార్జ్ రెడ్డి – ఈ తరం యువత చూడాల్సిన కథ

జార్జ్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవవాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడు.. విద్యార్థినాయకుడు. ఉస్మానియా యూనివర్శిటీలో 1965 నుంచి 1975 మ‌ధ్య ఎన్నో ఉద్య‌మాలు న‌డిపిన విద్యార్ధినాయ‌కుడు జార్జ్ రెడ్డి. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్‌ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శం.

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ, విద్యార్థి ఉద్యమాల్లో తిరుగు లేని నాయకుడుగా ఎదిగిన జార్జ్ రెడ్డిని హైదరాబాద్ చేగువేరా అని కూడా అంటారు. చాలా చిన్న వయసులో కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. అలాంటి ఈ గొప్ప నాయకుడి గురించి ఈ తరం వారు తెలుసుకోవాలనే ఉద్దేశ్యం తో జార్జ్ రెడ్డి పేరిట సినిమాను తెరకెక్కించారు ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి. మరి ఈ సినిమాను ఎలా తెరకెక్కించారు..జార్జ్ రెడ్డి జీవితాన్ని ఎలా చూపించాడు..అనేది రివ్యూ లో చూద్దాం.

కథ :

కేరళలో పుట్టి పెరిగిన జార్జి రెడ్డి (సందీప్ మాధవ్)ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు. ఆయన వచ్చేసరికి యూనివర్సిటీలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అగ్రకులాల ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. అది చూసి జార్జ్ రెడ్డి అసలు తట్టుకోలేకపోతాడు. విద్యార్థులకు అన్యాయం చేయాలనుకున్న వాళ్లను.. అలాగే అగ్రకులాల ఆధిపత్య ధోరణికి చరమగీతం పాడాలనుకుంటాడు. ఏ చిన్న తప్పు జరిగినా కూడా వచ్చి గల్లా పట్టుకుని మరీ నిలదీస్తుంటాడు. అది ఇతర స్టూడెంట్ యూనియన్లకు అస్సలు నచ్చదు. దాంతో పాటు అన్ని విషయాలపై కూడా ఉద్యమం లేవదీస్తాడు జార్జ్. అదే సమయంలో కాలేజీలో జరిగే స్టూడెంట్ పాలిటిక్స్‌లో కూడా వచ్చి తన సత్తా చూపించి నాయకుడిగా ఎదుగుతాడు. అలాంటి సమయంలో జార్జి రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు ఆయనను చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

ప్లస్ :

* జార్జ్ రెడ్డి కథ

* సాంకేతిక వర్గం

మైనస్ :

* సాగదీత సన్నివేశాలు

* ఎమోషనల్ సీన్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* జార్జ్ రెడ్డి పాత్రలో సందీప్ చించేసాడు..నిజంగా జార్జ్ రెడ్డి ఇలాగే ఉండే వాడేమో అనేంతలా ఒదిగిపోయాడు.

* సత్యదేవ్, చైతన్యకృష్ణ, మనోజ్, నందం చిన్న చిన్న పాత్రల్లో పర్వాలేదనిపించారు.

* హీరోయిన్ ముస్కాన్ కూడా చిన్న పాత్రలో కనిపించింది. మిగతా నటి నటులంతా కూడా కొత్తవారే

సాంకేతిక విభాగం :

* ఇలాంటి బయోపిక్ చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ చాల అవసరం..సినిమాను నిలబెట్టేది కూడా అదే..ఆ విషయంలో సురేష్ బొబ్బిలి ని మెచ్చుకోవాలి. అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. చాలా సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని నిలబెట్టింది.

* ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెపితే బాగుండేది. చాల సన్నివేశాల్లో సాగదీత కనిపించింది.

* సుధాకర్ రెడ్డి ఎక్కండి సినిమాటోగ్రఫీ బాగుంది. ఉస్మానియా క్యాంపస్‌ను చాలా అద్భుతంగా చూపించాడు.

* ఇక దర్శకుడు జీవన్ రెడ్డి గురించి చెప్పాలంటే..తాను అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తిస్థాయిలో మాత్రం చూపించలేకపోయారు. అన్నింటికీ మించి జార్జిరెడ్డిలో ఉన్న ఆవేశాన్ని తెరపై చాలా బాగా ఆవిష్కరించాడు. కానీ ఆ ఆవేశానికి తగిన సన్నివేశాలు సినిమాలో ఉండుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. కేవలం ఆవేశం మాత్రమే చూపించి కథనంపై దృష్టి కోల్పోయాడు దర్శకుడు జీవన్ రెడ్డి. ఫస్టాఫ్ అంతా కేవలం స్టూడెంట్ గొడవలతోనే సరిపోయింది. చెప్పుకోవడానికి బలమైన సన్నివేశాలు అంటూ ఏమీ లేకుండా పోయాయి.

జార్జిరెడ్డి చిన్నతనం.. ఆయన కాలేజీకి రావడం.. అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఆధిపత్య ధోరణిని చూడటం.. ఎవరు ఎదురుపడినా తిరగబడటం ఇది మాత్రమే చూపించాడు జీవన్ రెడ్డి. అసలు ఆయన ఎందుకు అంత రెబల్ అయ్యాడు.. ఆయన చేస్తున్న ఉద్యమం ఏంటి అనే విషయాలపై మరింత లోతుగా పరిశోధించి రెండు మూడు బలమైన సన్నివేశాలు సినిమాలో దర్శకుడు రాసి ఉంటే కచ్చితంగా జార్జిరెడ్డి రేంజ్ మరోలా ఉండేది. ఓవరాల్ గా ఈ తరం యువత తెలుసుకోవాల్సిన కథ.